మలయాళం నుండి టాలీవుడ్ కి నాని జెంటిల్‌మెన్ తో ఎంట్రీ ఇచ్చిన పొట్టి సుందరి నివేతా థామస్ ఇక్కడ తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది. హైట్ సమస్య కావొచ్చు... లక్ లేకపోవడం కావొచ్చు.. ఏదైనా గాని... టాలెంట్ ఉండి కూడా అందరి హీరోయిన్స్ లా నిలదొక్కుకోలేకపోయింది. గ్లామర్ కి దూరంగా నటనకు దగ్గరగా ఉన్న ఈ భామ తెలుగులో చేసింది రెండు మూడు సినిమాలే. నానితో కలిసి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో జెంటిల్‌మెన్‌లో నివేతా నటనకు విమర్శకుల సైతం కితాబునిచ్చారు. ఆ సినిమాతో టాలీవుడ్ కి టాలెంటెడ్ హీరోయిన్ దొరికింది అనుకున్నారు.
అలాగే నాని మరోమారు నిన్నుకోరిలో ఛాన్స్ ఇవ్వగా.. ఆ సినిమాలోని నివేతా అదరగొట్టే నటనతో ఆకట్టుకుంది. ఇక నివేతా థామస్ లక్కీ... అదృష్టం ఉన్న హీరోయిన్ అన్నారు. అందరూ అనుకున్నట్టుగానే నివేతా కి స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన జై లవ కుశ లో వన్ అఫ్ ది హీరోయిన్ ఛాన్స్ దొరికింది. అయితే ఆ సినిమాలో నివేత థామస్ పాత్ర నిడివి తక్కువతో పాటుగా.. పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర దక్కింది. ఇక స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన నటించిన నివేతకి జై లవ కుశ తో పెద్దగా ఒరిగింది ఏం లేదు. ఇక జై లవ కుశ విడుదలైన ఏడాదికి మళ్ళీ హీరో నిఖిల్ సరసన శ్వాస సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.
కిషన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించబోయే సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్‌గా నివేత నటిస్తుంది. ఈ సినిమా నిన్న శుక్రవారమే పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ శ్వాస సినిమా బోల్డ్ లవ్ స్టోరీ అని చెబుతున్నారు. ఇక తెలుగులో నివేతా తట్ట బుట్ట సర్దుకునే సమయంలో ఇలా నిఖిల్ సరసన ఛాన్స్ రావడంతో... మళ్ళీ తనని తాను నిరూపించుకుని టాలీవుడ్ లో నిలదొక్కుకోవాలనుకుంటుంది. మరి మంచి టాలెంట్ ఉన్న ఈ హీరోయిన్ ఇలా ఛాన్స్‌ల కోసం వెయిట్ చెయ్యడం మాత్రం ఆమె బ్యాడ్ లక్కే అని చెప్పాలి. చూద్దాం ఈ శ్వాస నివేతకి ఎలా ఊపిరిస్తుందో..?