తాను పెళ్లి చేసుకోవడం ఎవ్వరికీ ఇష్టం లేదని, చివరకు తన తండ్రికి కూడా నచ్చలేదని నిన్నటితరం టాప్‌హీరోయిన్ కాజోల్ తెలిపింది. ఈమె స్టార్ అజయ్‌దేవగణ్‌తో తన వివాహం గురించి తాజాగా నేహాధూపియా నిర్వహిస్తున్న ‘నోఫిల్టర్’ మూడో సీజన్‌లో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ, నేను, అజయ్‌దేవగణ్ పెళ్లి చేసుకోవాలని భావించాం. కానీ మా ఇంట్లోనే కాదు.. అజయ్ ఇంట్లో వారు కూడా దీనికి ఒప్పుకోలేదు. నా కుటుంబం మొత్తం ఈ విషయంలో సందేహపడింది. నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని మా తండ్రికి చెప్పాను. దాంతో ఆయన వారంకి పైగా నాతో మాట్లాడటం మానివేశాడు. చాలా కోప్పడ్డాడు. ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావ్? నీ వయసు చాలా తక్కువ. ఇప్పుడు నీ కెరీర్ అద్భుంగా ఉంది..దానిని చెడగొట్టుకోవద్దని చెప్పాడు.
మొదట్లో నాకూ.. అదే నిజం అనిపించింది. కానీ నాకు మాత్రం వెంటనే వివాహం చేసుకోవాలని ఉండేది. నేను, అజయ్ భిన్నఆలోచనలు ఉన్న వ్యక్తులం. మేము ఎంత కాలం కలసి ఉంటామో అని నాడు అందరూ భావించారు. మేమిద్దరం పనులను పంచుకుంటాం. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు. నేను, అజయ్ మనుషులుగా ఇద్దరం కావచ్చు. కానీ మనసు రీత్యా మేమిద్దం ఒక్కటే. మా మనసు, మా హృదయం, మా ప్రేమ అన్ని ఒక్కటే. మా పిల్లలు మాకు అదనపు బలం అని కాజోల్ చెప్పుకొచ్చింది. ఇక మీ సినిమాల విషయంలో మీ పిల్లల అభిప్రాయం, ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, నేను సినిమాలలో ఎక్కువగా ఏడుస్తూనే ఉంటానని నా పిల్లల అభిప్రాయం. నేను ‘గోల్‌మాల్’ వంటి చిత్రాలు చేస్తే చూడాలని వారికి ఉంటుందట.
కాగా కాజోల్, అజయ్‌దేవగణ్‌ల వివాహం 1999లో జరిగింది. నిజానికి చిన్నవయసులో అందునా ఉజ్వలమైన కెరీర్, డబ్బు, హోదా, స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు కన్న తల్లితండ్రులే కాదు.. మిగిలిన ఆమెమీద ఆధారపడే వారు కూడా ఆమె వివాహం చేసుకుంటే మనకి ఏమీ ఇవ్వదేమో అనే ఫీలింగ్‌లో ఉంటారు. అందుకే నాటి నుంచి నేటి వరకు చాలా మంది హీరోయిన్ల పెళ్లిళ్లను వాళ్ల తల్లిదండ్రులే అడ్డం తగులుతుంటారు. తమ కూతురు వివాహం చేసుకుంటే తమ పరిస్థితి ఏమిటి? అని హీరోయిన్ల పెళ్లిళ్లను ఆపివేసి, ఆ తర్వాత తోడులేక, మరోవైపు ఎవరో మోసగాళ్ల వైపు ఆకర్షితులై, ఆస్థి, పేరు కోసం కాచుకునే గుంటనక్కల వంటి వారిని పెళ్లి చేసుకుని జీవితాలను నాశనం చేసుకున్న నటీమణులకు కొదువే లేదు.