ప్రతి విషయంలోనూ డబుల్ స్టేట్‌మెంట్స్ ఉంటాయి. ఇదే విషయాన్ని ఓ సినిమాలో నటించిన పరుచూరి గోపాలకృష్ణ తెలుపుతాడు. ముఖ్యమంత్రి అయిన వ్యక్తి సినీరంగానికే చెందిన వాడై.. పరిశ్రమకు దూరంగా తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తూ ఉంటే కన్నతల్లి వంటి అన్నం పెట్టిన పరిశ్రమనే పట్టించుకోలేని వాడు ఇక ప్రజలకేం చేస్తాడు? అని విమర్శిస్తారు. అలాగని తాను వచ్చిన రంగాన్ని బాగా ఆదరిస్తూ ఉంటే.. ప్రజలకు సేవ చేయాలని ఎంచుకుంటే, రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా కేవలం సినిమా వారితోనే సమయం గడుపుతున్నాడని కూడా విమర్శలు చేస్తారు.
ఇక విషయానికి వస్తే ఇటీవల వచ్చిన తిత్లీ తుపాన్ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అక్కడే ఉండి పర్యవేక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం నాయకులేమో జగన్, పవన్‌లు అక్కడికి అసలు రాలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ పవన్ వంటి వారు వస్తే అక్కడ మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. పవన్‌ని చూడాలని అభిమానులు చుట్టుముట్టారంటే అది పోలీసులకు, అధికారులకు,సహాయ కార్యక్రమాలకు, బాధితులకు కూడా ఇబ్బందేనని చెప్పాలి.
ఇదే విషయంపై తాజాగా పవన్ స్పందిస్తూ.....తుపాన్ ప్రభావిత ప్రాంతాలలో నేను పర్యటించలేదని టిడిపి నాయకుల మాటలు అర్ధరహితం. తుపాన్ ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం చేపట్టింది. నేను వెళ్తే ఆ పనులకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి వెళ్లలేదు. జనసేన కవాత్తు కోసమే నేను తుపాన్ ప్రాంతాల పర్యటనను వాయిదా వేసుకున్నాననేది నిజం కాదు. నన్ను విమర్శించే విషయంలో టిడిపి నాయకులు కాస్త నిగ్రహం ప్రదర్శించాలి. జనసేన అనేది ఓ బాధ్యతాయుతమైన పార్టీ. నా పర్యటనలపై టిడిపివారు విమర్శలు చేయకుండా ఉండాలి. మీగెలుపు వెనుక జనసేన ఉందనే విషయం మర్చిపోవద్దు.
మాపై చేసే ప్రతి విమర్శకు తర్వాత టిడిపి నాయకులు ఫలితం అనుభించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వీటికి మూల్యం చెల్లించక తప్పడు. ప్రతి విషయాన్ని, విమర్శలను మేము గుర్తించుకుంటాం. తుపాన్ వచ్చి వారం అయినా ఇప్పటికీ అనేక గ్రామాలు విద్యుత్ లేక చీకటిలోనే ఉన్నాయి. ముఖ్యమంత్రిగారూ ..ఈ చీకటి సమయంలో వారిబతుకుల్లో వెలుతురు నిపండి.. అంటూ జనసేనాని తనపై టీడీపీ చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చాడు.