ఈ ఏడాది దసరా వచ్చింది వెళ్ళింది కానీ.. మెగా స్టార్ హీరోల సినిమాల లుక్స్ మాత్రం బయటికి రాలేదు. అందులోను షూటింగ్ మొదలెట్టుకుని కొద్ది నెలలు గడుస్తున్న చరణ్ - బోయపాటి సినిమా లుక్ గాని, టైటిల్ గాని బయటకు రాలేదు. మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుండో రామ్ చరణ్ RC12 లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఆగష్టు లోనే రామ్ చరణ్- బోయపాటిల లుక్ అండ్ టైటిల్ రివీల్ చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ లేదు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు బాబాయ్ బర్త్ డే కి అబ్బాయ్ గిఫ్ట్ అంటూ తెగ ప్రచారం చేశారు. అక్కడా మెగా ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది.
ఇక వినాయక చవితికి అన్నారు అది లేదు. తాజాగా ఒక నెల నుండి రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ వినయ విధేయరామ అంటూ ప్రచారం జరగడం.. అది దసరా కానుకగా విడుదల చేస్తారంటూ తెగ హడావిడి చేశారు. అలాగే రామ్ చరణ్ కొత్త లుక్ కూడా దసరా కానుకగా విడుదల చేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఎక్కడా రామ్ చరణ్ - బోయపాటిల సినిమా లుక్ పై చడీ చప్పుడు లేదు. ఇక దీనితో మెగా ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. మొన్నటి వరకు అజర్ బైజాన్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న RC12 నిన్న వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంది. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా టైటిల్ వినయ విధేయరామని చిత్ర బృందం పీలర్ రూపంలో బయటికి వదలగా.. ఇప్పుడా టైటిల్ అందరి నోళ్ళలో బాగా నానుతుంది. ఇక అందరి నోళ్ళలో బాగా నానిన ఆ టైటిల్ నే ఫైనల్ గా బోయపాటి బృందం ఫిక్స్ చేసేలా కనబడుతుంది.
ఇక గత ఏడాది ఎప్పుడో షూటింగ్ మొదలెట్టుకున్న చిరంజీవి సై రా నరసింహారెడ్డి చిత్రం మొదలైనప్పుడు చిరు బర్త్ డే కి మోషన్ పోస్టర్ ద్వారా మెగా ఫ్యాన్స్ ని ఖుష్ చేసిన వారు మళ్ళీ ఈ ఏడాది పుట్టిన రోజుకి సై రా నరసింహారెడ్డి టీజర్ ని వదిలారు. అయితే ఈ ఏడాది దసరాకి సై రా లుక్ బయటికొస్తుందంటూ ప్రచారం జరిగినా.. ఈ దసరాకి సై రా బృందం మెగా ఫ్యాన్స్ కి హ్యాండ్ ఇచ్చింది. ఇక స్టార్ హీరోలైన చరణ్, చిరు రెండు చిత్రాల లుక్స్ బయటికి రాకపోయే సరికి మెగా ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు.