నేటి ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకుంటున్నారనేది వాస్తవమే అయినా అనవసరమైన చోట్ల కామెడీ ట్రాక్‌లు పెట్టి విసిగిస్తే అసలుకే ప్రమాదమనే చెప్పాలి. అలాగే నేటి ప్రేక్షకులలో మంచి మార్పు కనిపిస్తోంది. మంచి వైవిధ్యభరితమైన చిత్రాలను వారు బాగా ఆదరిస్తున్నారు. గత కొంతకాలం ఉదాహరణలనే తీసుకుంటే 'నేనే రాజు నేనేమంత్రి, గూఢచారి, మహానటి, పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్100, రంగస్థలం, భరత్ అనే నేను' వంటివి ఎన్నో ఉన్నాయి. ఇక 'కేరాఫ్ కంచరపాలెం' నుంచి ఎన్నో చిత్రాలు మెప్పిస్తూ వస్తున్నాయి. ఇక ఫ్యాక్షన్ చిత్రాలకు, పక్కా యాక్షన్ చిత్రాలకు ఓవర్‌సీస్‌లో ఆదరణ ఉండదని పలువురు భావిస్తుంటారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ -యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'అరవిందసమేత వీరరాఘవ' చిత్రం ఫ్యాక్షన్ కోవకే చెందినా కూడా ఇది ఓ అరుదైన కథగానే చెప్పాలి. యుద్దం తర్వాత ఏమి జరుగుతుందనే ఫ్లాట్ పాయింట్‌ని తీసుకుని మరీ త్రివిక్రమ్ కథను అద్భుతంగా చెబితే, ఎన్టీఆర్, జగపతిబాబు, తమన్ వంటి వారు వాటికి జీవం పోశారు. ఈ చిత్రం రొటీన్ ఫ్యాక్షన్ చిత్రం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. డ్యాన్స్‌ల్లో అదరగొట్టి, కేవలం ఎన్టీఆర్ స్టెప్పుల కోసం, త్రివిక్రమ్ తరహా కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, పంచ్‌ల కోసం మరలా మరలా సినిమాలను చూసే రిపీట్ ఆడియన్స్‌ని సైతం కాదని 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రాన్ని త్రివిక్రమ్ ఎంతో హృద్యంగా చూపించారు. ఆయన నిజాయితీగా తీసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకులకే కాదు.. విమర్శకులు, సినీ ప్రముఖులు సైతం నీరాజనాలు అర్పిస్తున్నారు.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలలో కామెడీ బాగా ఉంటుంది. సినిమాలో అది తగ్గిందనే అభిప్రాయాన్ని ఆడియన్స్ వెల్లడిస్తున్నారు... అనే ప్రశ్నకు ఎన్టీఆర్ చాలా బాగా సమాధానం చెప్పాడు. 'వీరరాఘవుడి తండ్రి చనిపోయాడు.. హీరో ఓ సొల్యూషన్ వెతుకుతూ వెళ్తున్నాడు. ఆ టైంలో కామెడీ చేస్తే బాగుంటుందా? ఈ సినిమాలో నరేష్‌గారు, ఆకుబ్యాచ్, హీరోయిన్లు కామెడీ చేశారు కదా...! అది చాలు.. నేను కామెడీ చేయకూడదు. చేస్తే క్యారెక్టర్ వాల్యూస్ తగ్గుతాయి. త్రివిక్రమ్ గారు ఒక్కోసారి ఒక్కో కథ రాస్తారు. ప్రతిసారి ఆయన కామెడీ కథనే రాయాలని ఏముంది? ఆయనను ఓ ఛట్రంలో ఇరికించి, అందులోనే బంధిస్తే ఎలా? అని సమాధానం ఇచ్చాడు.
ఇక త్రివిక్రమ్ ఇదే విషయంపై స్పందిస్తూ, ఈ కథకి కామెడీ వల్ల రసభంగం కలుగుతుందని అనిపించింది. సెకండాఫ్‌లో పాట పెట్టడానికే భయపడి పోయామంటే మీకు పరిస్థితి అర్ధం అయి ఉంటుంది... కానీ కామెడీ లేకపోతే ఎలాగా? అని మాత్రం మేము భయపడలేదు. కారణం బలమైన కథే. కామెడీ ఈ కథలో కూర్చోవడం లేదు. కథను పాడుచేయడం ఇష్టం లేకనే కామెడీని ఇరికించే ప్రయత్నం చేయలేదు... అని చెప్పుకొచ్చాడు.