సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా వాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సినిమా కథల కాపీ, టాక్, అందులోని నాన్సెస్.. ఇలా ప్రతి ఒక్కటీ క్షణాలలో ప్రపంచం మారుమూలలకి తెలిసిపోతోంది. ఇక నేటి సినిమా ప్రముఖులు సోషల్ మీడియాను రెండు విషయాలలో బాగా తిట్టుకుంటున్నారు. అందులో ఒకటి సినిమా విడుదలైన గంటల్లోనే హడావుడిగా, ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో తెలుసుకోకుండా రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమా ఫలితం, కలెక్షన్లపై ప్రభావం పడుతోందని, రివ్యూలు ఇవ్వడానికి అంత తొందర ఎందుకు?ఒక సినిమా రివ్యూలలో ఒక్కో చోట ఒక్కో విధంగా విశ్లేషణలు ఉండటం, రేటింగ్స్‌లో తేడాలు ఎందుకు ఉంటున్నాయి? అసలు రివ్యూరైటర్లకి సినిమాని జడ్జి చేయడంలో ఉన్న అర్హతలు ఏమిటి? అనే విమర్శలు ఎప్పటి నుంచో వస్తున్నాయి.
రెండోది సినిమా వారిపై యూట్యూబ్‌లలో ఏదో ఒక ఆసక్తికరమైన హెడ్డింగ్‌ని పెట్టి, వీడియో లోపల మాత్రం ఏమీ ఉండదని, ఇలా తెలిసి తెలియక తమ జీవితాలను గురించి వారు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని కూడా సినీ ప్రముఖులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఇక తాజాగా సింగర్, బిగ్‌బాస్ పార్టిసిపెంట్ గీతామాధురి కూడా యూట్యూబ్‌లపై ఓ రేంజ్‌లో మండిపడింది. కొన్ని యూట్యూబ్ చానెల్స్ తనపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయని, నానా చెత్త రాస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రవర్తనను మార్చుకోకపోతే సదరు యూట్యూబ్ చానెల్స్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.
తనను ఇబ్బంది పెట్టేలా కొందరు వ్యక్తులు తప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి వ్యక్తులకు కొన్ని రోజుల సమయం ఇస్తున్నానని, ఆవీడియోలను వెంటనే తొలగించాలని ఆమె అల్టిమేటం ఇచ్చింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోన్న వీడియోలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌ని పోస్ట్ చేసింది.