దక్షిణాదిలో ఎన్నో చిత్రాలలో నటించిన సీనియర్ నటి శ్రీప్రియ. ఈమె దర్శకురాలిగా, ప్రముఖ మహిళా నేతగా, సామాజిక కార్యకర్తగా కూడా అందరికీ పరిచయం. ఇండస్ట్రీలోని పరిస్థితులు ఆమెకి కొట్టిన పిండి. ఈమె ఇటీవల వెంకటేష్, మీనా జంటగా వచ్చిన మలయాళ రీమేక్ ‘దృశ్యం’కి కూడా దర్శకత్వం వహించింది. ఈమె తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాదకి మద్దతు ప్రకటించింది. వైరముత్తు విషయంలో తీవ్ర ఆరోపణలు చేసిన చిన్మయికి అండగా నిలబడుతూ ఆమె మాట్లాడింది.
చిన్మయి ఎంతో క్రమశిక్షణ, కమిట్‌మెంట్ ఉన్న ప్రతిభాశాలి. ఆమె ఎంతో నిజాయితీ, బాధ్యత కలిగిన యువతి. కాబట్టి ఆమె ఆరోపణల్లో నిజమే ఉంటుందని నేను నమ్ముతున్నాను. సినీ రంగంలో వేధింపులు ఉన్నాయి. ఎప్పటి నుంచో లైంగిక వేధింపులు ఉంటూనే వస్తున్నాయి. వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లైంగిక ఆరోపణలపై కమిటీ వేస్తున్నట్లు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నిర్మాతల మండలి అధ్యక్షుడు హీరో విశాల్ ప్రకటించడం శుభపరిణామం. ఈ కమిటీ వల్లనైనా దోషులు, ఇలాంటి వ్యక్తులు బయటకు వస్తారని నమ్ముతున్నాను. ఇలాంటివి రూపు మాపాలంటే ఖచ్చితంగా కఠిన చర్యలు అవసరం... అని తెలిపింది.
ఇక సీనియర్ నటి కస్తూరి దీనిపై స్పందిస్తూ, అన్ని రంగాలలోనూ లైంగిక వేధింపులు ఉన్నాయి. ఈ విషయంలో మహిళలకు న్యాయం జరగాలి. మీటూ ఉద్యమం ఓ మంచి పరిణామం. ఈ ఉద్యమంతోనైనా పరిశ్రమలో, వ్యక్తుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ఈ ఉద్యమం ద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకుందని చెప్పుకొచ్చింది. మొత్తంగా చిన్మయికి మద్దతు ఇచ్చిన వీరిద్దరు మంచి సీనియర్లు కావడంలో వైరముత్తు వ్యవహారశైలి తెలిసే వీరు చిన్మయి శ్రీపాదకి సంఘీభావం ప్రకటించారనే చర్చ కోలీవుడ్‌లో సాగుతోంది.