ఎందుకో తెలియదు గానీ తెలుగు సినీ ప్రముఖులు కొన్ని విషయాలలో వెంటనే స్పందిస్తారు. మరికొన్నింటిలో అలసత్వం ప్రదర్శిస్తుంటారు. అందుకే సాయం చేసినా వారిపై విమర్శలు మాత్రం ఏదో విధంగా వస్తూనే ఉంటాయి. ఎంత సాయం ప్రకటించామనేది కాదు.. ఎంత త్వరగా స్పందించామనేది ముఖ్యం. హుధూద్ తుఫాన్ సమయంలో కూడా రామ్‌చరణ్ స్పందించే దాకా మిగిలిన వారు స్పందించలేదు. ఇక ఈశాన్య భారతంలో వరద భీభత్సం వస్తే చరణ్, ఆయన శ్రీమతి ఉపాసన వెంటనే స్పందించారు. ప్రస్తుతం తెలుగు స్టార్స్ తమిళ, మలయాళ పరిశ్రమల్లో కూడా తమ క్రేజ్ పెంచుకోవాలని చూస్తున్నారు. దాంతో కేరళ, చెన్నై, తమిళనాడులోని ఇతర ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించారని, కానీ మనతోటి తెలుగువారు, తెలుగు సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిపించే పెద్ద మనసు ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తిత్లీతుపాన్‌కి అతలాకుతలం అయినా వెంటనే స్పందించలేదు. అదే ఇప్పుడు పెద్ద విమర్శలకు ఆస్కారం ఇస్తోంది.
ఈ విషయంలో ముందుగా స్పందించింది బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు. ఆయన ప్రకటించిన 50వేల రూపాయలు ఆయన స్థాయికి చాలా ఎక్కువే అని చెప్పాలి. మొత్తానికి సంపూ వల్ల అలసత్వం వీడి బయటకు వచ్చిన తెలుగు స్టార్స్ మెల్లమెల్లగా స్పందిస్తున్నారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ 15లక్షలు, సెన్సేషనల్ స్టార్ విజయ్‌దేవరకొండ 5లక్షలు, మెగా హీరో వరుణ్‌తేజ్ 5లక్షలు, నందమూరి కళ్యాణ్‌రామ్ 5లక్షల విరాళం ప్రకటించారు. ఇక మెగా హీరో వరుణ్‌తేజ్ 5లక్షల విరాళం ప్రకటిస్తూ, మన ప్రజల కోసం మనం నిలబడాల్సిన సమయం ఇది. నా వంతు సాయం చేశాను. బాధితులు తమ ఇళ్లను పునర్నిర్మించుకోవడానికి కావాల్సిన సాయాన్ని అందజేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని తెలిపాడు.
ఇక ప్రస్తుతం వరుణ్‌తేజ్ వెంకటేష్‌తో కలిసి అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్2’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా అనిల్‌రావిపూడి కూడా తనవంతు సాయంగా లక్ష ప్రకటించాడు. మరోవైపు యంగ్ హీరో నిఖిల్ తన టీంతో వెళ్లి బాధిత ప్రదేశాలలో నిర్వాసితులకు ఆహారం, ఇతర అత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్నాడు. ఇతర ప్రముఖులు కూడా విరివిరిగా విరాళాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువ మంది స్పందించకపోవడంపై కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. కేరళకు ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే స్పందించారని, అదే తోటి తెలుగు వారికి కష్టం వస్తే మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారని, కోట్లకు కోట్లు పారితోషికం తీసుకునే వారు కూడా నామమాత్రంగా స్పందిస్తున్నారని, కనీసం సంపూని చూసి అయినా నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.