జనసేనాని పవన్‌కల్యాణ్ తాజాగా రాజమండ్రి వద్ద ఉన్న ధవళేశ్వరం కాటన్‌బ్రిడ్జ్‌పై లక్షకు పైగా జనసేనికులతో కవాత్తు నిర్వహించాడు. ఇక విషయానికి వస్తే ఈ సభలో మాత్రం పవన్ ప్రసంగం ఎంతో ఆకట్టుకుంది. ఆయనలోని ఆవేశం కట్టలు తెంచుకుంది. నక్సలైట్లు ఎందుకు తయారవుతారు? అనే విషయం నుంచి తాత, తండ్రుల నుంచి డీఎన్‌ఏ, రూపురేఖలు, కోట్లాది సంపాదన వారసత్వంగా వస్తుందేమో గానీ అనుభవం ఎలా వస్తుందని చంద్రబాబుకు, లోకేష్‌కి చురకలు అంటించాడు. పంచాయతీ మెంబర్‌గా కూడా గెలవని లోకేష్‌కి ఏమి తెలుసని పంచాయిజీ రాజ్ శాఖను ఇచ్చారని? పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు చంద్రబాబు భయపడుతుంటే.. జగన్ కూడా దానిపట్ల మౌనంగా ఉంటున్నాడని విమర్శించాడు.
ఈ సభలో ఆయన ఎక్కువగా చంద్రబాబు, లోకేష్‌లనే విమర్శించినప్పటికీ జగన్‌పై కూడా కాస్తో కూస్తో విమర్శలు చేయడం స్వాగతించదగ్గ విషయం. ఇక గతంలో ఎప్పుడు తనకు కులం గురించి మాట్లాడటం నచ్చదని, తాను కులం గురించి అసలు పట్టించుకోలేనని చెప్పిన పవన్ ఈసారి మాత్రం కాపులకు అనుకూలంగా మాట్లాడుతూనే, తన కులాన్ని తాను కాదనలేదనని, తాను ఏ కులంలో పుట్టాలి? ఏ భాష మాట్లాడే చోట పుట్టాలి? అనేది తన చేతుల్లో లేవని తేల్చిచెప్పాడు. ఇక ఈ సభ సందర్భంగా జనసైనికులు పవన్‌ని సీఎం.. సీఎం అని నినదిస్తూ ఉంటే ఈ మాటలు విశ్వంలోకి వెళ్లి మీరు అనేదే సత్యమవుతుందని చెప్పాడు.
ఇక ఓ కానిస్టేబుల్ కుమారుడు సీఎం ఎందుకు కాకూడదని ప్రశ్నించాడు. రాష్ట్రంలో జనసైనికుల ఓట్లు గల్లంతు అయ్యాయని, కాబట్టి యువత అందరు ఓట్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సీఎం పీఠం ఒక అలంకారం కాదని, అయితే దానిని బాధ్యతగా స్వీకరించేందుకు తాను సిద్దమేనని ఆయన ప్రకటించాడు.