సినిమా వేడుకలలో హీరోలు దర్శకులను, దర్శకులు హీరోలను తెగ పొగుడుకోవడం మామూలే. అయితే సరిగా లేని చిత్రాలు, డివైడ్ టాక్‌తో ప్రేక్షకుల నుంచి విమర్శల టాక్‌ని అందుకుంటున్న చిత్రాల విషయంలో జరిగే విజయోత్సవ సభల్లో ఇలాంటివి ఉంటే విని, చూసి, చదివే ప్రేక్షకులు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటారు. అయితే నిజంగా ఎంతో గొప్పగా ఉన్న చిత్రం విషయంలో మాత్రం ఇలాంటివి బాగానే, సహేతుకంగానే ఉంటాయి. ముఖ్యంగా ఎంతో ప్రతిభ కలిగిన స్టార్స్, డైరెక్టర్స్ ఇలాంటి పొగడ్తలకు నిజంగా అర్హులేనని చెప్పాలి. అందునా చిచ్చరపిడుగు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, కనికట్టు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల గురించి అందునా 'అరవింద సమేత వీరరాఘవ' వంటి అద్భుత చిత్రం తర్వాత బయటి వారే విపరీతమైన ప్రశంసలు గుప్పిస్తుంటే వారిద్దరు పరస్పరం పొగుడుకోవడంలో తప్పేమి లేదు.
ఇక విషయానికి వస్తే తాజాగా జరిగిన 'అరవింద సమేత వీరరాఘవ' విజయోత్సవ సభలో ఎన్టీఆర్‌ని ఎంతో లోతుగా అభివర్ణించిన త్రివిక్రమ్ సెహభాష్ అనిపించుకున్నాడు. అదే సమయంలో ఎన్టీఆర్ సైతం త్రివిక్రమ్‌ని ఓ రేంజ్‌లో పొగిడి, ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్.. త్రివిక్రమ్ గురించి చెబుతూ, ఎన్ని బంధాలతో పిలిచినా పలికే ఆత్మీయుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్‌తో ఓ చిత్రం చేయాలని, ఆ చిత్రం చిరస్థాయిగా తన గుండె లోతుల్లో మిగిలిపోవాలని భావించాను. ఆ చిత్రాన్ని సమాజానికి, పిల్లలకు గర్వంగా చూపించుకోవాలనేది నా కోరిక. అటువంటి చిత్రమే 'అరవిందసమేత వీరరాఘవ' అని కొనియాడాడు. ఈ సినిమా విజయాన్ని త్రివిక్రమ్ ఖాతాలో వేస్తున్నాను. ఎందుకంటే త్రివిక్రమ్‌ని నేను అంతలా నమ్మాను. ఆయన్ని అంతలా నమ్మేలా చేసింది ఆయనే కదా...! త్రివిక్రమ్ కలం నుంచి పుట్టిన ఓ అద్భుతమైన కథ ఈ 'అరవింద సమేత వీరరాఘవ' అని ప్రశంసలతో ముంచెత్తాడు.
మరోవైపు ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో కూడా అద్భుత కలెక్షన్లు సాధిస్తోంది. సాధారణంగా ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు ఓవర్‌సీస్‌లో పెద్దగా ఆదరణ ఉండదు. అందుకే 'జనతాగ్యారేజ్'కంటే 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఓవర్‌సీస్‌లో ఎక్కువ కలెక్షన్లు సాధించింది. కానీ 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం కథలో దమ్ముంటే చాలని నిరూపించింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ కూడా తెలిపాడు. కేవలం యూఎస్‌లోనే కాదు యూకే, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి చోట్ల కూడా దీనికి అద్భుతమైన ఆదరణ లభిస్తుండటం విశేషం.