ఏమాటకామాటే చెప్పుకోవాలి.. అంటే ఎన్టీఆర్ గతంలో ఎందరో టాప్ డైరెక్టర్స్‌తో వర్క్ చేసి అద్భుతమైన విజయాలను సాధించాడు. 'ఆది, సాంబ, అదుర్స్' వంటి చిత్రాలను డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌తో చేశాడు. మరోవైపు 'స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ' వంటి బ్లాక్‌బస్టర్స్‌ని యంగ్‌టైగర్ ముద్దుగా పిలుచుకునే జక్కన్నతో చేశాడు. ఈ ఇద్దరు ఎన్టీఆర్ స్టార్‌గా ఎదగడంలో ఎంతో తోడ్పడ్డారు. వీరందరు దాదాపు సమకాలీకులే. అయితే ఇన్ని చిత్రాలు చేసినా కూడా ఎన్టీఆర్‌లోని సత్తాని వారు మాటల రూపంలో బయట పెద్దగా వివరించలేకపోయారు. కానీ ఎన్టీఆర్‌తో మొదటిసారి పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం తన మాటల చాతుర్యంతో ఎన్టీఆర్‌లోని అసలు సిసలు నటుడిని తన మాటలతోనే వర్ణించిన తీరు చూస్తే ఒకే ఒక్క చిత్రంలో ఎన్టీఆర్‌ని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో లోతుగా స్టడీ చేశాడనే విషయం అర్ధమవుతోంది.
ఇక ఈ చిత్రం విజయోత్సవ సభ సందర్భంగా త్రివిక్రమ్ యంగ్‌టైగర్ గురించి ఇచ్చిన స్పీచ్ అందరినీ మంత్రముగ్దులను చేసింది. ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ, ఇంతటి ఘన విజయానికి కారకుడు ఎన్టీఆర్.. ఆయనలోని గొప్పనటుడే. ఎమోషనల్ సన్నివేశాలలో ఆయన నటించిన తీరు ప్రతి ఒక్కరికి విపరీతంగా నచ్చింది. స్పాంటేనియస్‌గా నటించే సత్తా, సీన్‌ని ఆయన అర్ధం చేసుకునే తీరు, దానికి ఆయన జోడించే నటన, సన్నివేశంలో ఇమిడిపోయి, పరకాయ ప్రవేశం చేయగల సత్తా తారక్‌కి ఉన్నాయి. అందువల్లనే ఇంత సులభంగా ఈ చిత్రాన్ని నేను పూర్తి చేయగలిగాను. తారక్‌తో కేవలం 15 నిమిషాలలోనే ఎంతో కీలకమైన సన్నివేశాలను తీశానంటే ఆయన ప్రతిభ ఏపాటిదో అర్ధం అవుతుంది.
ఆయనతో పూటల కొద్ది సమయం తీసుకోవాల్సిన అవసరమే లేదు. తాతను మ్యాచ్ చేసే సత్తా తారక్‌కి ఉంది. తాత అంతటి వాడే అవుతాడు. సినిమాకి మొదలు, మధ్చ, చివర అంతా తారకే. ఆయన అంత బలమున్న నటుడు. ఇలాంటి నటులను చాలా అరుదుగా మాత్రమే చూస్తాం. తారక్ తన తాతయ్య పేరుని నిలబెడతాడు. 'నన్ను నమ్మి ఈ సినిమా తీయండి.. రిజల్ట్ గురించి ఆలోచించవద్దు' అని ఆయన నాతో అన్నారు. అందుకే ఈ విజయాన్ని ఆయన ఖాతాలోనే వేస్తున్నానని ఉద్వేగంగా ప్రసంగించారు. సినిమాలలోని సంభాషణల్లోనే కాదు.. బయట మాటల్లో, ప్రసంగాల్లో కూడా త్రివిక్రమ్ ఎంతో లోతుగా ఆలోచిస్తాడనే దానికి ఇది ఉదాహరణగా చెప్పాలి.