ఎంతో క్రేజ్, ఇమేజ్ ఉన్న స్టార్స్ చిత్రాలలో ఎంత బాగా నటించినా కూడా పేరంతా హీరోకే వస్తుందని ఒకనాడు భావించేవారు. కానీ నాటి ఎస్వీఆర్, రాజనాల, రావుగోపాలరావు, కోట శ్రీనివాసరావు నుంచి రావు రమేష్, ప్రకాష్‌రాజ్ వంటి వారు అది నిజం కాదని తేల్చారు. ఇక జగ్గూభాయ్ అదేనండీ జగపతిబాబు హీరోగా ఉన్నప్పుడు 'శుభలగ్నం, శుభాకాంక్షలు, ఆయనకిద్దరు' వంటి ఫ్యామిలీ చిత్రాలే కాదు.. 'గాయం, సముద్రం, అంత:పురం' వంటి చిత్రాలతో తన నటనా సత్తా చాటాడు. కానీ ఆయన దురదృష్టమో, లేక ఆయన ప్రతిభను ఇండస్ట్రీ సరిగా వాడుకోలేకపోవడమో గానీ ఆయన టాలెంట్‌కి తగ్గ పేరు ప్రఖ్యాతులు మాత్రం రాలేదు. ఇక బోయపాటి శ్రీను బాలయ్యకి సరిపడే ప్రతినాయకునిగా జగపతిబాబుకి 'లెజెండ్'లో తొలిసారి విలన్ వేషం ఇచ్చాడు. అందులో ఆయన అద్బుతంగా, బాలయ్య వంటి మాస్ ఇమేజ్ విపరీతంగా ఉన్న బాలయ్యకి ధీటుగా నటించి అవార్డులు, రివార్డులు పొందాడు.
ఇక ఈ నాలుగేళ్లలో ఆయనకు తిరుగులేకుండా పోయింది. మలయాళంలో మోహన్‌లాల్, తమిళంలో రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్స్‌తో కలసి నటించాడు. ఇక 'నాన్నకుప్రేమతో, రంగస్థలం' చిత్రాలతో ఆయన ఎన్నో మెట్లు ఎదిగి, బిజీ ఆర్టిస్టుగా మారి త్వరలో బాలీవుడ్‌కి కూడా పరిచయం కానున్నాడు. నేడు దక్షిణాదిన అత్యంత బిజీ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ నటుడు జగ్గూభాయే అనడంలో సందేహం లేదు. అయితే ఆయనకు ఎక్కువగా రిచ్ క్యారెక్టర్స్ మాత్రమే వస్తున్నాయని ఇటీవల అందరు మొనాటనీగా ఫీలవుతున్నారనే విమర్శలు వచ్చాయి.
కానీ 'రంగస్థలం'తో సత్తా చాటి తాజాగా 'అరవింద సమేత వీరరాఘవ'లో రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్‌గా ఎంతో క్రూయల్, రగ్‌డ్ పాత్రలో ఆయన చూపిన ప్రతిభను ఎన్టీఆర్‌తో సమానంగా ప్రశంసలు దక్కుతున్నాయి. 'బసిరెడ్డి'గా ఆయన లుక్, బాడీలాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని అదుర్స్. ఆయనలోని అసలు సిసలు నటుడిని త్రివిక్రమ్ పూర్తిగా బయటకు తెచ్చాడు. ఎన్టీఆర్ సలహాతో ఈ పాత్రను దక్కించుకున్న ఆయన ఎన్టీఆర్ మాటను నిలబెట్టాడు. రాయలసీమ యాసతో సునాయాసంగా ఎంతో సహజంగా ఆయన డైలాగ్స్ చెప్పినతీరు, హావభావాలకు అందరు మంత్రముగ్దులైపోతున్నారు.
ఈ చిత్రానికి రిపీట్ ఆడియన్స్‌ని తేవడంలో ఎన్టీఆర్‌తో పాటు జగపతి బాబు కూడ కీలకంగానే మారుతున్నాడు. ఇలాంటి నటన ఇప్పటి వరకు వచ్చిన ఏ ఫ్యాక్షన్ చిత్రంలో ఎవ్వరూ చూపించలేదనే కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. నటునిగా జగపతి లోని కొత్త కోణాన్ని, నట విశ్వరూపాన్ని ఈ చిత్రం ఆవిష్కరించింది. ఈ చిత్రానికి గాను ఎన్టీఆర్, జగపతిబాబుకు అవార్డులు ఖాయమని అంటున్నారు. రివార్డులతో పాటు అవార్డులు కూడా వారి సొంతం కావడం ఖాయమే అనిపిస్తోంది. విలన్‌గా మరో ఐదారేళ్లు జగపతి కెరీర్ మరింత ఊపందుకోవడం ఖచ్చితమేనని చెప్పాలి. వహ్‌వా.. బసిరెడ్డి.