మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి.. వెనుక వచ్చు వారికి దారి అవుతుంది.. రహదారి అవుతుంది. ఓ కవి చెప్పిన ఈ మాటలు అక్షరసత్యాలు. విషయానికి వస్తే గుండె వ్యాధులు, క్యాన్సర్ సోకిన వారికి, పౌష్టికాహారం లేని పిల్లలకు, అనాధలకు, దివ్యాంగులకు, తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్న పిల్లలకు.. ఇలా ప్రతి ఒక్కరి విషయంలో ముందుగా స్పందించేది వేలకోట్లు ఉన్న పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు కాదు.. ఈ విషయంలో సినీ పరిశ్రమ, ప్రముఖులు ముందుంటారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, దివిసీమ ఉప్పెన, జై ఆంధ్రా పోరాటం సమయంలో ఎన్టీఆర్ నుంచి ఏయన్నార్ వరకు అందరూ జోలి పట్టి, ప్రతిచోటా ప్రదర్శనలు ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇక సూపర్‌స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఇటీవల విశాఖని హుధూద్ తుపాన్ కకావికలు చేయడంతో ముందుగా రామ్‌చరణ్ స్పందించి ఆర్దిక సాయం అందించాడు. ఆ తర్వాత మిగిలిన వారు కూడా అదే బాటలో నడిచారు. ఇక ఇప్పుడు శ్రీకాకుళంకి తీరని నష్టం చేసిన తిత్లీ తుపాన్ విధ్యంసంలో ఇంకా సినీ ప్రముఖులు ఎవ్వరూ స్పందించడం లేదేమిటబ్బా అనుకునే సమయంలో సామాన్య కుటుంబానికి చెంది, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు ముందడుగు వేశాడు. నిజానికి ఈయన తెలంగాణ వ్యక్తే అయినప్పటికీ ప్రత్యేకహోదా ఉద్యమం జరిగిన వైజాగ్‌కి ఎన్నో ఇబ్బందులను సైతం అధిగమించి వచ్చి.. తెలుగువారంతా ఒక్కటే అని చాటి చెప్పాడు. ప్రస్తుతం తిత్లీ తుఫాన్ బాధితుల కోసం ఆయన 50వేల రూపాయలను ఏపీ ముఖ్యమంత్రి నిధికి అందించి తన దాతృత్వం చూపించాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తిత్లీ తుపాన్ వల్ల శ్రీకాకుళం జిల్లా ఎంతో నష్టపోయిందని స్నేహితులు, మీడియా ద్వారా తెలుసుకున్నాను. నావంతుగా 50వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నాను. మనవంతు సాయంగా అన్ని వర్గాల వారు స్పందించాలని కోరుకుంటున్నాను అని తెలిపాడు. తిత్లీ తుపాన్ భీభత్సంపై ముందుగా స్పందించిన నటుడు సంపూర్ణేష్‌బాబే కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన తుపాన్ భీభత్సానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశాడు. మొత్తానికి ఈ విషయంలో సంపూ మొదటి అడుగు ముందుకేశాడు. మరి ఆయన బాటలో ఎందరు నడుస్తారో చూడాలి...! హ్యాట్సాఫ్ టు సంపూ..!