ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాదు.. ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం నటీమణుల లైంగిక వేధింపుల ఆరోపణలతో 'మీటూ' ఉద్యమంతో అట్టుడుకుతోంది. ఇక రెబెల్ లేడీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ కంగనా రౌనత్ తన ప్రతి చిత్రం విడుదలకు ముందు తన మాజీ ప్రేమికుడు హృతిక్‌పై ఆరోపణలు చేస్తూ సినిమా ప్రమోషన్స్‌కి వాడుకుంటోందని ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ క్వీన్ తాను 'క్వీన్' చిత్రంలో నటించేటప్పుడు చిత్ర దర్శకుడు వికాస్ బహల్ తనతో సెట్స్‌లో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో వికాస్ ఆ తర్వాత కూడా తనతో మరో చిత్రం చేయడానికి వచ్చాడని, కథలో మార్పులు చేస్తేనే నటిస్తానని చెప్పానని, నాటి నుంచి వికాస్ తనను సినిమాలలోకి తీసుకోవడంలేదని ఆరోపించింది. మరి ఆయన అంత వెధవ అయితే రెండో చిత్రంలో కూడా నటించేందుకు కథలో మార్పులు చేర్పులు సూచించడం ఎందుకు? అనే అనుమానం అందరికీ వస్తుంది.
ఇదే విషయాన్ని వికాస్ మాజీ భార్య రిచాడుబే ఖండించి, తన మాజీ భర్తకి మద్దతు తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. వికాస్ మంచి వాడు కానప్పుడు నిజజీవితంలో కూడా కంగనా, వికాస్‌తో ఎందుకు స్నేహం చేసింది? ఇలా ఆరోపణలు హద్దులు మీరుతున్నాయి. ఇది నిజాయితీగా జరుగుతున్న 'ఉద్యమం' కాదు. ఓ పురుషుడు అసౌకర్యానికి గురి చేస్తే అసభ్యంగా ముట్టుకుంటే ఆయనతో అదే మహిళ మరలా స్నేహాన్ని కొనసాగిస్తుందా? నేను ప్రతి మహిళను అడుగుతున్నాను. ఆ తర్వాత ఆయనతో మీరు మాట్లాడటం తగ్గించారా? ఆయనతో కలసి పార్టీలకు, డిన్నర్లకు వెళ్లలేదా? ప్రతిభ ఉన్న దర్శకుడు కాబట్టి ఆయనతోనే మరలా పనిచేయడానికి సిద్దపడతారా? కంగనా వ్యక్తిత్వంలో కూడా లోపాలున్నాయని చెప్పింది.
దానికి కంగనా కూడా కౌంటర్ ఇస్తూ, మాజీ భర్తకి సాయం చేసేందుకు మాజీ భార్య ముందుకు వచ్చింది. మరి వికాస్ మంచి వాడైతే ఆయనతో ఎందుకు విడాకులు తీసుకున్నావు? పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని, ఇప్పటికీ మాది ఒకటే కుటుంబం అని చెత్త కారణాలు చెప్పవద్దు. పనిచేసే చోట రక్షణ ఉండేందుకు ఏమైనా చేస్తే చేయి? అని వ్యాఖ్యానించింది. ఇక 'మణికర్ణిక' రిలీజ్ దగ్గరగా ఉండటంతోనే కంగనా ఇలా మాట్లాడుతోందని కొందరు అంటున్నారు.