నేడు దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి అన్ని వర్గాల వారిని పట్టిస్తున్న మహమ్మారి క్యాన్సర్ భూతం. గౌతమి నుంచి సోనాలి బింద్రే వరకు ఎందరో దీనితో పోరాడుతున్నారు. ఇక నాటి ఎన్టీఆర్ శ్రీమతి బసవతారకం కేన్సర్‌తో మరణించడంతో అలాంటి అభాగ్యుల కోసం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ని ఆ కుటుంబం ప్రారంభించి ఎందరికో సేవ చేస్తోంది. టి.కృష్ణ నుంచి ఎందరో సినీ ప్రముఖులు మృత్యువాత పడ్డారు. క్రికెటర్ యువరాజ్ సింగ్ వంటి వారు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇక నేటి తరం నటీనటులలో దేశం గర్వించదగ్గ నటులుగా ఇర్ఫాన్‌ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీలను చెప్పుకోవాలి. ఇప్పటికే ఇర్ఫాన్ తీవ్రమైన వ్యాధితో జీవితంతో పోరాడుతున్నారు.
తాజాగా నవాజుద్దీన్ సిద్దిఖీ భయంకరమైన నిజాన్ని వెల్లడించాడు. తన చెల్లి 25వ పుట్టినరోజు సందర్భంగా ఈయన మాట్లాడుతూ, తన చెల్లి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోందని తెలిపాడు. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ, నా చెల్లికి 18ఏళ్ల వయసులోనే రొమ్ము క్యాన్సర్ అడ్వాన్స్‌డ్ స్టేజీలో బయటపడింది. కానీ ఆమె తన ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వ్యాధిని జయించేందుకు పోరాటం చేస్తూనే ఉంది. తను 25వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఇప్పటికీ అంటే ఏడేళ్ల నుంచి ఇంకా క్యాన్సర్‌తో పోరాడుతూనే ఉంది. ఆమెకి ప్రేరణ కలిగించిన వైద్యులకు ధన్యవాదాలు. నేను సరైన వైద్యులను కలవడానికి కారణమైన పూకుట్టి సార్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. అని భయంకరమైన, బాధ కలిగించే విషయాన్ని తెలిపాడు.
ఈ సందర్భంగా నవాజుద్దీన్ సోదరి కోలుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో చెబుతూ వారికి మనోబలం ఇస్తున్నారు. ఇక క్యాన్సర్ వ్యాధి బసవతారకం నుంచి పరుచూరి రఘుబాబు, బిగ్‌బాస్ సీజన్2 విజేత కౌశల్ తల్లి వంటి వారిని కూడా కబళించింది. ఆర్దికంగా బలవంతులు, మంచి ఉన్నత చదువులు కలిగిన వారికి కూడా క్యాన్సర్‌పై సరైన అవగాహన కొరవడుతోంది. బసవతారకం స్ఫూర్తితో వారి కుటుంబసభ్యులు క్యాన్సర్ హాస్పిటల్ కట్టించడం, ఇటీవల బిగ్‌బాస్ ప్రైజ్‌మనీని సైతం కౌశల్ క్యాన్సర్ బాధితులకు విరాళం ఇవ్వడం వంటివి ఆర్ధికంగా బలవంతులు చేస్తే వారి పుణ్యాన ఎందరో తమ ప్రాణాలను నిలబెట్టుకుంటారని మాత్రం చెప్పవచ్చు.