మీడియా అనేది శక్తివంతమైన సాధనం. దీనిని సరిగా వినియోగించుకుంటే సమాజానికి ఎంత ఉపయోగమో.. తప్పుగా వాడితే అంత కంటే ప్రమాదకరం. అందుకే మీడియాను ఫోర్ట్ ఎస్టేట్‌గా, ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా అభివర్ణిస్తుంటారు. కానీ ఎన్నో ఏళ్ల కిందటే మహాకవి శ్రీశ్రీ సైతం స్వతహాగా రచయిత, జర్నలిస్ట్ అయినప్పటికీ 'పత్రికలు అనేవి సమాజానికి విషపుత్రికలు'గా అభివర్ణించాడు. కేవలం ప్రింట్ మీడియా కూడా పూర్తిగా విస్తరించని ఆ రోజుల్లోనే శ్రీశ్రీ అలా అన్నాడంటే.. నేడు తామరతంపరలుగా పుట్టుకొస్తున్న పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలను చూసి ఉంటే మరెంతగా ఆవేదన చెందేవారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక మీడియా బాధ్యత ఏమిటంటే సమాచారం అందించిన వారి పేర్లను, వివరాలను, మహిళ, బాల బాధితుల పేర్లను బయటపెట్టకూడదనేది నియయం.
కానీ మన వారు మాత్రం వారికి పబ్లిసిటీ కోసం వాడుకుంటూ మరెంత మంది బయటపడతారో అనే బ్రేకింగ్ న్యూస్, సర్క్యులేషన్, టీఆర్పీలు, క్లిక్‌ల కోసం బాధితులను, సమాచారం ఇచ్చిన వారిని మరింతగా పీడిస్తుంటాయి. వాళ్లకి కావాల్సింది కేవలం సెన్సేషనల్ వార్తలు, అందరి కంటే ముందుగా సమాచారం ఇవ్వడమే గానీ బాధితులకు, సమాచారం ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచి, తమదైన ఇన్వెస్టిగేషన్‌తో మరింత మంది నిందితులను బయటపెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇక విషయానికి వస్తే ప్రముఖ తమిళ సాహిత్యవేత్త, గేయ రచయత వైరముత్తు అకృత్యాలను గాయని చిన్మయి శ్రీపాద తన కెరీర్‌ను, ప్రాణాలను సైతం పణంగా పెట్టి బయటపెట్టింది. కానీ ఈ పరిస్థితులే చిన్మయి, ఆమె కుటుంబ సభ్యులకు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. ఇంటర్వ్యూల కోసం మీడియా వారు చిన్మయిని విపరీతంగా వేధిస్తున్నారట. అయితే ఇంటర్వ్యూలు ఇవ్వడానికి చిన్మయి నిరాకరిస్తోంది. ఎలాంటి ఫోన్ కాల్స్‌కి ఆమె సమాధానం ఇవ్వడం లేదు. దీంతో చిన్మయి తల్లికి మీడియా వారు ఫోన్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ పరిస్థితి చిన్మయికి, ఆమె తల్లికి ఇబ్బందికరంగా మారింది.
దీంతో 70ఏళ్ల ఆమె తల్లి పలు విధాలుగా బాధలు పడుతోందిట. దీంతో ఈ పరిస్థితిపై విసుగు చెందిన చిన్మయి ట్విట్టర్ ద్వారా మీడియాకు ఓ విన్నపం చేసింది. పదే పదే ఫోన్లు చేస్తూ వృద్దాప్యంలో ఉన్న తన తల్లిని ఇబ్బంది పెట్టవద్దని, దయచేసి ఆమెకి కాల్స్ చేయవద్దని కోరింది. దీనిని చూస్తే మీడియా తీరు ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే మరెవ్వడో వచ్చి బీడీ (ఇప్పుడు వీటి వాడకం తగ్గిపోయిందిగా..) సారీ సిగరెట్ వెలిగించుకోవడానికి నిప్పు అడిగినట్లుగా ఉందని అనిపించకమానదు.