పదేళ్ల తర్వాత తన ప్రతిష్టాత్మక చిత్రంగా చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ 'ఖైదీనెంబర్ 150' చేసి రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక వెంటనే తన 151వ చిత్రంగా తమ హోం బేనర్ అయిన 'కొణిదెల' బేనర్‌లో రామ్‌చరణ్ నిర్మాతగా ఏకంగా 200కోట్లకు పైగా బడ్జెట్‌తో తన డ్రీం ప్రాజెక్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా 'సైరా..నరసింహారెడ్డి' చేస్తున్నాడు. నిజానికి దీని వెంటనే చిరంజీవి గీతాఆర్ట్స్ అధినేత అల్లుఅరవింద్ నిర్మాణంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేయాల్సివుంది. కానీ బోయపాటి తన కుమారుడే అయిన రామ్‌చరణ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి 'సైరా' తర్వాత చేయబోయే చిత్రం కొరటాల శివతోనే అని అనఫిషియల్‌గా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
'మిర్చి, జనతాగ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు, ప్రతి హీరోకి కెరీర్ బెస్ట్ హిట్స్‌ని అందిస్తున్న స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ కొరటాల శివతోనే చిరు చేయనున్నాడు. 'భరత్ అనే నేను' తర్వాత ఎంతో టైం తీసుకుని 'సైరా'లో చిరు పార్ట్ పూర్తయిన తర్వాత మాత్రమే సినిమాని ప్రారంభించనున్నాడు. అంటే దీనికి మరికొంత సమయం పడుతుంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించే చిత్రంలో ఆయన రైతు బాంధవునిగా కనిపించనున్నాడట. రైతుల తరపున నిలబడి వారి సమస్యలపై పోరాడే నాయకునిగా మెగాస్టార్ కనిపించనున్నాడు. ఇప్పటికే తాను తీసిన నాలుగు చిత్రాలలో ఒక్కో సామాజిక సమస్యపై చర్చించిన కొరటాల ప్రస్తుతం రైతుల సమస్యలపై దృష్టి పెడుతున్నాడు.
కమర్షియల్ అంశాలతో పాటు ఓ మంచి సందేశంగా ఉండే ఈ చిత్రానికి 'రైతు' అనే టైటిల్‌ని అనుకుంటున్నారని తెలుస్తోంది. సంక్రాంతికి దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. గతంలో బాలకృష్ణ తన 100వ చిత్రంగా మొదట కృష్ణవంశీతో కలిసి 'రైతు' చిత్రం చేయాలని భావించాడు. కానీ అమితాబ్ డేట్స్ ఇవ్వని కారణంగా బాలయ్య బయటకు వచ్చాడు. ఇప్పుడు అదే 'రైతు' టైటిల్ మెగా కాంపౌండ్‌కి వెళ్లడం విశేషమనే చెప్పాలి.