మామూలు చిత్రాలను తీయడం అంటే ఒక ఎత్తైతే అదే బయోపిక్‌లను, అందునా పూర్వకాలం నేపధ్యంలో సాగే సొంత జీవితాలను చూపించడం వందరెట్లు కష్టం. స్వాతంత్య్ర పూర్వం జరిగే స్టోరీ అంటే దానికి తగ్గ వాతావరణం, నాటి సమాజం, ఇల్లు వాకిల్లు, నాటి ఆ ప్రాంతాల పరిస్థితి, ప్రజల జీవనవిధానం, వారు కట్టుబొట్టు, వేషధారణల నుంచి ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, నాటి చారిత్రక అంశాలను సేకరించి, నిజాలను చూపించడం అనే దానికి ఎంతో రీసెర్చ్ అవసరం అవుతుంది. ఇక 'బాహుబలి' తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఏకంగా 200కోట్లకు పైగా బడ్జెట్‌తో 'సై..రా..నరసింహారెడ్డి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు, రాయలసీమ ముద్దుబిడ్డ, వీరుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా ఇది రూపొందుతోంది. దాంతో ఇందులో బ్రిటిష్ కాలం నాటి ప్రజలు, బ్రిటిషర్లు, మన రాయలసీమ ఉద్యమ కారులు, గుర్రాల స్వారీలు, భారీ యుద్ద సన్నివేశాలన్ని ప్రేక్షకులకు ఐఫీస్ట్‌గా చూపించేందుకు యూనిట్ ఎంతో కష్టపడుతోంది. అసలు ఇలాంటి చిత్రం బాధ్యతలను ఏకంగా సురేందర్‌రెడ్డికి అప్పగించడంపై కూడా నాడు పలు విమర్శలు వచ్చాయి.
కానీ ఈ చిత్రం షూటింగ్ విశేషాలు, స్టిల్స్, టైటిల్ మోషన్ పోస్టర్స్, తాజాగా అమితాబ్ లుక్, లుక్‌కి సంబంధించిన టీజర్‌లు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని 'బాహుబలి'లానే తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. దాంతో అన్ని భాషలలో గుర్తింపు ఉన్న నటీనటులను ఎంచుకుంటూ ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. చిరంజీవి సరసన ఆయన భార్యగా నటిస్తోన్న నయనతారకి కోలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే సమయంలో తమిళ తంబీలను మరింత ఆకట్టుకునేందుకు తమిళ సెన్సేషనల్ స్టార్‌గా ఎదుగుతున్న విజయ్ సేతుపతి, కన్నడలో స్టార్‌గా, కిచ్చాగా, ఇప్పటికే తెలుగులో 'ఈగ, బాహుబలి' చిత్రాలతో ఆకట్టుకున్న సుదీప్ నటిస్తున్నారు.
తాజాగా వీరిద్దరికి సంబంధించిన లుక్స్‌ని యూనిట్ విడుదల చేసింది. విభిన్న వేషధారణలతో ఇద్దరు సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ మూవీ ఈ ఇద్దరి కెరీర్‌లో చెప్పుకోదగిన చిత్రంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇక దీనికి అమిత్ త్రివేది సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ మరో స్థాయికి తీసుకెళ్లతాయని అంటున్నారు.