కాకతాళీయమో ఏమో గానీ స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. పాలుపోసుకుంటూ సబ్ రిజిస్టార్‌గా ఉద్యోగం వచ్చినా కూడా సినిమాలలోకి రావడం, ఆ తర్వాత టాప్ స్టార్‌గా ఎదగడం, టిడిపిని స్థాపించి సంచలనాలకు తెరతీయడం జరిగింది. ఇక రాజకీయాలలో ఆయన లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకోవడం, దానిని ఆయన కుటుంబ సభ్యులే ఎదిరించడం జరిగింది. చంద్రబాబు.. ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి తాను ముఖ్యమంత్రి కావడానికి నందమూరి కుటుంబ సభ్యులందరు సహాయ సహకారాలు అందించారు. దీనిని చాలా మంది వెన్నుపోటు అంటారు. కొందరు మాత్రం టిడిపి పార్టీని లక్ష్మీపార్వతి నాశనం చేయకుండా ఉండేందుకే ఇలా చేయాల్సి వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి.
ఇక ఎన్టీఆర్ జీవితంలో ఇంతే కాదు.. రాజకీయాలలో నాదెండ్ల భాస్కర్‌రావు నుంచి ఇందిరాగాంధీ వరకు ఎన్నో అంశాలు మిళితమై ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌ని ఆయన కుమారుడైన నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సినీ జీవితంపై ఓ భాగం, రాజకీయ జీవితంపై మరో భాగంగా అంటే రెండు పార్ట్‌లుగా విడుదల చేయనున్నారు. ఇక బాలకృష్ణకి ఏపీ సీఎం, ఎన్టీఆర్ అల్లుడు, తన బావ, వియ్యంకుడు అయిన చంద్రబాబు ఎంతో సన్నిహితుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ జీవిత చరమాంకం, ఆయన రెండో వివాహం వంటివి చూపిస్తారా? అంటే అసాధ్యమనే అనిపిస్తోంది. వాస్తవ చరిత్రలో వివాదాలు లేని విధంగా దీనిని తీస్తున్నారట. ఇక ఇందులో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ మరో కుమారుడు, బాలయ్య అన్నయ్య హరికృష్ణ పాత్రకి కూడా ప్రాధాన్యం ఉందట. ఎందుకంటే ఆయనే తండ్రికి రథసారధి.
ఇటీవలే హఠాన్మరణం చెందిన హరికృష్ణ పాత్రను ఈ చిత్రంలో ఆయన కుమారుడు నందమూరి కళ్యాణ్‌రామ్ పోషిస్తున్నాడు. తాజాగా ఆయన షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. ఈ విషయాన్ని కళ్యాణ్‌రామే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇంకా కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ, 30ఏళ్ల కిందట వచ్చిన 'బాలగోపాలుడు'లో బాలనటునిగా నటించాను. మరలా ఇప్పుడు ఇలా యాక్ట్ చేస్తున్నాను. బాబాయ్ వాళ్ల నాన్నగారిలా.. నేను నా నాన్నగారిలా నటిస్తుండటం ఎంతో ఆనందంగా, మరిచిపోలేని అనుభూతిగా మిగులుతోంది.. అని చెప్పుకొచ్చాడు. ఇక కళ్యాణ్‌రామ్‌కి చెందిన స్టిల్‌ని కూడా యూనిట్ విడుదల చేసింది.