విజయ్ దేవరకొండ... నటునిగా, ఆయన కష్టపడిన తత్వం, సినిమాల మీదనే మోజు పెంచుకుని నేడు మూడు నాలుగు చిత్రాలతోనే సెన్సేషనల్ స్టార్‌గా మారాడు అనడంలో సందేహం లేదు. కానీ ఆయన యాటిట్యూడ్ మాత్రం కొంత మందికి నచ్చదు. ఇటీవల మరో యంగ్ హీరో నాగశౌర్య మాట్లాడుతూ, స్టార్ స్టేటస్ అనేది కేవలం రామ్‌చరణ్‌తోనే ముగిసిపోయిందని, ఇక ఎవ్వరూ స్టార్స్‌గా మారే అవకాశం లేదని తేల్చిచెప్పాడు. చిరంజీవి నుంచి ఎందరో ఎన్నో ఏళ్లు కష్టపడితేనే స్టార్ ఇమేజ్ వచ్చిందని, కానీ నేడు కొందరు నాలుగైదు చిత్రాలతోనే స్టార్స్‌గా మారామనే భ్రమలో ఉన్నారని వ్యాఖ్యానించాడు. దాంతో అందరు అది విజయ్ దేవరకొండ గురించేనని అనుకున్నారు. అందులో నిజం కూడా ఉంది.
ఇక ప్రస్తుతం ఎవ్వరి అండదండలు లేకుండానే వరుస విజయాలతో దూసుకెళ్తూ, విజయ్ దేవరకొండ లాగ శేఖర్‌కమ్ముల ద్వారానే నటునిగా పరిచయం అయి, వరుసగా విభిన్న చిత్రాలు చేస్తోన్న హీరో నిఖిల్. ఈమధ్య కాలంలో ఆయనకు కూడా పెద్ద పరాజయం అంటూ ఏమీ లేదు. 'శంకరాభరణం' డిజాస్టర్‌గా నిలిస్తే, 'కేశవ, కిర్రాక్ పార్టీ'లు ఫర్వాలేదనిపించాయి. ప్రస్తుతం ఆయన మరో రీమేక్ అయిన తమిళ 'కణితన్' తెలుగు వెర్షన్‌లో హీరోగా నటిస్తున్నాడు. మీడియా రిపోర్టర్‌గా నటించనున్న ఈ చిత్రానికి 'ముద్ర' అనే వెరైటీ టైటిల్‌ని కూడా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నిఖిల్ చేసిన ట్వీట్ సంచలనాలకు కారణం అవుతోంది.
ఈ ప్రపంచం మన చుట్టూ తిరుగుతోందని భావించే వారి కోసం ఈ ట్వీట్ చేస్తున్నాను. వారు అనవసరమైన యాటిట్యూడ్‌ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ నువ్వు అంత ముఖ్యమైన వాడివి కావు. ప్రతి నటుడు తనతో తాను పోటీ పడాలి.. అని చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, సినిమా రంగం వంటి మహాసముద్రంలో మనం నీటి బొట్టు వంటి వారం. ఇక్కడ హైప్ తక్కువగా ప్రదర్శించాలి. పని ఎక్కువ చేయాలి' అంటూ మంచి మాట చెప్పుకొచ్చాడు. నిఖిల్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు అనేది తెలియకపోయిన పలువురు కేవలం విజయ్ దేవరకొండను ఉద్దేశించి మాత్రమే అని అంటున్నారు. ఇక విజయ్ దేవరకొండని సపోర్ట్ చేస్తూ కొందరు నిఖిల్‌ని టార్గెట్ చేస్తూ ఉంటే.. మరి కొందరు మాత్రం నిఖిల్‌కి మద్దతు తెలుపుతున్నారు. ఓ చిత్రంలో బ్రహ్మానందం తనకంతా తెలుసునని భావించే పాత్రను కూడా ఫొటో ద్వారా నిఖిల్ పోస్ట్ చేయడం విశేషం. !