తెలుగులో ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్లలో బాబి అలియాస్ కె.ఎస్. రవీంద్రకి ప్రత్యేకస్థానం ఉంది. మాస్‌మహారాజా రవితేజతో ‘పవర్’ చిత్రం తీసి తన సత్తా చాటాడు. రవితేజ ఇమేజ్‌ని సరిగ్గా క్యాచ్‌చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ వెంటనే ఈయనకు అనుకోని బంపర్ ఆఫర్ వచ్చింది. పవన్‌కళ్యాణ్ తీయాలని భావించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’కి మొదట సంపత్‌నందిని దర్శకునిగా అనుకున్నా కూడా చివరి తరుణంలో ఈయన స్టార్ రైటర్ కోన వెంకట్ సాయంతో ఆ చిత్ర దర్శకత్వ పగ్గాలు చేపట్టాడు. మరి ఈ చిత్రం ఫలితంలో బాబికి సంబంధం లేదని, ఆ చిత్రాన్ని కేవలం పవన్ సలహాల మేరకే బాబి దర్శకత్వం వహించాడనే వారు కూడా ఉన్నారు.
‘సర్దార్ గబ్బర్‌సింగ్’ వంటి డిజాస్టర్ తర్వాత ఇక బాబి పని అయిపోయిందని పలువురు భావించారు. కానీ దర్శకునికి కొలబద్ద జయాపజయాలు కావని, కేవలం టాలెంట్ మాత్రమే ముఖ్యమని బాబీని చూస్తే అర్ధమవుతుంది. ఈ విషయం తెలిసిన వాడే కావడంతో ఆయన మీద ఉన్న నమ్మకంతో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ భారీ చిత్రంగా, అందునా నిర్మాతగా వరుస పరాజయాలలో ఉన్న నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మాతగా.. ‘ఎన్టీఆర్’ ఆర్ట్స్ బేనర్‌లో రూపొంది ఘనవిజయం సాధించిన ‘జైలవకుశ’కి బాబీకి ఛాన్స్ ఇచ్చాడు. దాంతో బాబీ స్టామినా ఏమిటో అందరికీ తెలిసివచ్చింది..!
ముఖ్యంగా ‘జైలవకుశ’ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉండే జై పాత్రను ఆయన మలిచిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక తన తదుపరి చిత్రంగా వెంకటేష్-నాగచైతన్యలతో మల్టీస్టారర్ ‘వెంకీమామా’ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు. ఇక విషయానికి వస్తే బాబీకి తాజాగా ఓ పాప పుట్టింది. దాంతో ఆయన తన ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని తెలియజేశాడు. తన కుటుంబం మరింత పెద్దదైందని చెబుతూ, నా వరకు ఇది సహజమైన రోజు. కానీ ఇప్పుడే అది మరచిపోలేనిరోజుగా మారింది. నాకు పాప పుట్టింది. నా కుటుంబం మరింత పెద్దదైంది. చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు. బాబీ ట్వీట్‌ని చూసిన దర్శకుడు హరీష్‌శంకర్ ‘శుభాకాంక్షలు బాబీ.. అమ్మవారి నవరాత్రుల్లో అమ్మాయి పుట్టింది..’ అంటూ అభినందించాడు.