సినీప్రముఖులను ఆకట్టుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాస్త ముందుంటాడు. నాటి రాఘవేంద్రరావు నుంచి రాజమౌళి, బోయపాటి శ్రీను వరకు ఎందరో ఆయనకు కుడి భుజాలుగా వ్యవహరించేవారు. అంతేకాదు.. స్వయాన తన పార్టీలోనే బాలకృష్ణ ఉన్నాడు. ఇక నందమూరి ఫ్యామిలీతో పాటు జనసేనాధిపతి పవన్‌తో కూడా నిన్నటివరకు మంచి సత్సంబంధాలు ఉండేవి. ఇలా సినీగ్లామర్, సినీ ప్రముఖులకు పెద్ద పీట వేయడం ఆయనకు మొదటి నుంచి అలవాటే.
ఇటీవల నంది అవార్డుల కమిటీకి కూడా జీవితను నియమించి తన చాణక్యం చూపాడు. నాటి బాబూమోహన్ నుంచి నేటికి మురళీమోహన్ వరకు ఆయనంటే అభిమానమే. ఇక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబుకి అందరు నటీనటుల సహాయసహకారాలు కావాలి. దానితో పాటు ఏపీకి సినిమా పరిశ్రమను తేవడంపై ఇటీవల కాస్త శ్రద్ద పెట్టాడు. అందులో భాగంగానే రాష్ట్రంలో పోస్ట్‌ప్రొడక్షన్స్ జరుపుకునే చిన్న సినిమాలకి రాయితీలు, మంచి చిత్రాలకు నగదు ప్రోత్సాహాలు ప్రకటించాడు. ఇక పెద్ద స్టార్స్ చిత్రాలకు ఎంతో కాలంగా ఆయన ప్రత్యేక షోలకి అనుమతులు కూడా ఇస్తూ వస్తున్నాడు.
అందులో భాగంగానే అక్టోబర్11న విడుదల కానున్న యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ -త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ప్రతిష్టాత్మక భారీ చిత్రానికి కూడా ప్రత్యేక షోల అనుమతులు ఇచ్చాడు. అక్టోబర్ 11 నుంచి 18వ తేదీ వరకు ఏపీ వ్యాప్తంగా ఆరు షోలను ప్రదర్శించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులనిచ్చింది. ఉదయం 5 గంటల నుంచి 11 గంటలలోపు రెండు ప్రత్యేకషోలకు పచ్చజెండా ఊపారు. భారీ బడ్జెట్‌తో రూపొందడమే కాదు.. దసరా సెలవుల సందర్భంగా వస్తున్న చిత్రం కావడంతో దీనికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ‘అరవిందసమేత వీరరాఘవ’ చిత్రం సందడి ఇప్పటికే నందమూరి అభిమానులు, యంగ్‌టైగర్ వీరాభిమానులు, సామాన్య ప్రేక్షకులలో కూడా సందడి సృష్టిస్తోంది.
‘గీతాగోవిందం’ తర్వాత మరో పెద్ద హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న టాలీవుడ్‌కి ‘వీరరాఘవుడు’ బాక్సాఫీస్ సందడిని తేవడం ఖాయమని నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇక తెలంగాణలో మొదటి నుంచి టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేకషోల విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తోంది. అందునా ఎన్నికల ప్రచారం మొదలైనందున తెలంగాణలో మాత్రం ప్రత్యేక షోలకి అనుమతి ఉండదని తేలిపోతోంది.
మరి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ వెసులుబాటును జూనియర్, త్రివిక్రమ్‌లు ఎంత వరకు ఉపయోగించుకుంటారు? హారిక అండ్ హాసిని అధినేత రాధాకృష్ణకు కాసుల వర్షం కురిపించి, భారీ ఓపెనింగ్స్‌తో పాటు బ్లాక్‌బస్టర్‌ని అందుకుంటారా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది!