పెద్దల మాట చద్ది మూట అని పెద్దలు అనేది ఊరికేకాదు. జీవితంలో అన్నింటికంటే అనుభవం చాలా గొప్పది. చిన్నవయసులోనే అలాంటి అనుభవజ్ఞుల పాఠాలు విని గుణపాఠాలు నేర్చుకుంటే జీవితంలో ఒకసారి చేసిన తప్పు మరోసారి జరగకుండా జాగ్రత్తపడగలం. తప్పు చేయని వారు ఎవ్వరూ ఉండరు. కానీ ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునే నిత్యవిద్యార్ధులకు అపజయం ఉండదు. వచ్చినా వెంటనే తొలగిపోతుంది. ఇక విషయానికి వస్తే ‘కొత్త బంగారులోకం’తో దర్శకునిగా పరిచయమై తెలుగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో ఫ్యామిలీ కథాంశాల ద్వారా కూడా మల్టీస్టారర్స్‌ని ఆకట్టుకునేలా తీస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపించిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. తర్వాత ‘ముకుందా’తో నిరాశపరిచాడు.
కానీ ఆ తర్వాత ఆయన పివిపి వంటి భారీ బేనర్‌లో ఎంతోప్రతిష్టాత్మంగా, అద్భుతమైన క్యాస్టింగ్‌తో మహేష్ పిలిచి మరి ‘బ్రహ్మోత్సవం’ వంటి అవకాశం ఇస్తే దానిని కనీస స్థాయిలో కూడా నిరూపించుకోలేక పోయాడు. తాజాగా ఈ చిత్రం పరాజయంపై పరుచూరి తనదైన విశ్లేషణను అందిస్తూ, ఈ సినిమాకి తొమ్మిది మంది రచయితలు పనిచేశారు. ఒక్కోక్కళ్ల భావన, ఆలోచన ఒక్కోవిధంగా ఉంటుంది. ఇంత మంది అయితే ఒకరేం రాశారో మరొకరికి తెలియదు. అలాంటప్పుడు చెప్పదలుచుకున్న విషయం కనెక్ట్ కావడం కష్టం.
ఒకరోజున శ్రీకాంత్ అడ్డాల మా అన్నయ్య వద్దకు వచ్చి.. ‘‘గొప్పఅవకాశం పోగొట్టుకున్నాను. చాలా బాధగా ఉంది అని ఫీలయ్యాడట. ఆయనలా బాధపడటంలో అర్ధముంది. మహేష్‌బాబు వంటి స్టార్‌తో సినిమా చేసే అవకాశం రావడం ఒక వరం. అలాంటి వరం దక్కినప్పుడు హడావుడిగా సినిమా తీయాలని పరుగులెత్తకుండా, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కో స్టార్ ఒక్కో చిత్రం కోసం ఏడాది రెండేళ్లు కష్టపడి నమ్మకంతో చిత్రం చేస్తాడు. కాబట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సినిమా దెబ్బతింటుంది అనే దానికి ఇదే ఉదాహరణ’’ అని చెప్పుకొచ్చాడు.
గతంలో ‘కంత్రీ’ విషయంలో కూడా ఇదే తప్పు జరిగింది. కేవలం ఈవీవీ, పూరీ వంటి కొందరు మాత్రమే ఇలాంటి ప్రయోగాలలో సక్సెస్ అయ్యారు.