పాతతరంలో ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి వారు కూడా పలు విభిన్న కోణాల చిత్రాలు, మల్టీస్టారర్స్ కూడా చేశారు. ప్రతినాయక పాత్రలకు, డీగ్లామరైజ్‌డ్ వేషాలతో పాటు అంగవికలాంగులగానూ, బుద్దిమాంద్యం కలిగిన పాత్రల వంటివి కూడా చేసి మెప్పించారు. చిరంజీవి కూడా తన కెరీర్ ప్రారంభంలో ‘ఆరాధన, రుద్రవీణ, ఆపద్బాంధవుడు’ వంటి పాత్రలు చేశాడు. ఎన్టీఆర్ అయితే ‘కలసి ఉంటే కలదు సుఖం, తిక్కశంకరయ్య’ వంటి పాత్రలతో అలరించాడు. ఆ తర్వాత కాలంలో చంద్రమోహన్, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ వంటి వారు మాత్రమే అలాంటి పాత్రలు మెప్పించారు.
ఇక ఇటీవల కాస్త ట్రెండ్‌లో మార్పు వచ్చింది. ‘రాజా దిగ్రేట్’ చిత్రంలో రవితేజ, ‘రంగస్థలం’ చిత్రంలో రామ్‌చరణ్‌లు తమ సత్తా చాటారు. ఇక విషయానికి వస్తే తెలుగు తెరకు గ్లామర్ అద్దిన దర్శకుల్లో కె.రాఘవేంద్రరావు పేరు ముందుగా చెప్పాలి. ఆయన ‘అడవిరాముడు, వేటగాడు’ చిత్రాలు కమర్షియల్ ఫార్ములా అంటే ఏమిటో చెప్పాయి. ఆయన కూడా ‘పదహారేళ్ల వయసు’ వంటి చిత్రాలలో హీరోయిజం లేని పాత్రలను కూడా తీర్చిదిద్దిన విషయం గమనించదగిన విషయం. ఈ దర్శకేంద్రుడు తాజాగా పరిశ్రమలో వచ్చిన మంచి మార్పుని తనదైనశైలిలో వివరించాడు.
తమిళ, బెంగాలీ, హిందీ భాషా చిత్రాలలో జరుగుతున్న ప్రయోగాలు తెలుగులో జరగడం లేదు. తెలుగు దర్శకులు ప్రయోగాలు చేసేందుకు ముందుకు రావడం లేదనే విమర్శ ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, కొంత కాలం ముందు వరకు ఈ విమర్శ నిజమేనని అనుకోవచ్చు. కానీ ఇప్పుడొస్తున్న కొత్త దర్శకులు విభిన్నంగా ఆలోచిస్తున్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తూ వెళ్తున్నారు.
రామ్‌చరణ్ వంటి హీరోని చెవిటివాడిగా చూపించాలంటే మేమే భయపడతాం. కానీ సుకుమార్ అద్భుతంగా ఆ పాయింట్‌ని హ్యాండిల్ చేశాడు. ఇక ఇమేజ్‌ని సైతం పక్కన పెట్టేసి హీరోలు ముందుకు రావడం కూడా మంచిపరిణామం, హ్యాట్సాఫ్ టు రామ్ చరణ్..’ అని చెప్పుకొచ్చాడు. మార్పు మంచికేనని చెప్పాలి. వాటిని ప్రేక్షకులు కూడా ఆదరించాల్సి వుంది...!