పవన్ నుంచి ఆయన స్థాపించిన జనసేన నుంచి ఓటర్లు ఆశించిందివేరు. వ్యక్తిగత విమర్శలకు, రిజర్వేషన్లు, ఇతర ప్రజా సంక్షేమం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న పార్టీలకు భిన్నంగా ఆయన రాజకీయాలు ఉంటాయని మొదట్లో ఆయన ప్రసంగాలు, చెప్పిన సిద్దాంతాలను బట్టి అందరు భావించారు. నేడు ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ. ప్రైవేట్‌యాజమాన్యాలు రిజర్వేషన్లను పట్టించుకోవు. కేవలం ప్రతిభనే ఆధారంగా తీసుకుంటాయి. ప్రపంచం ప్రైవేటీకరణ జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్ల వల్ల ఎవ్వరికి ఉపయోగంలేదు. మరో వైపు రంజాన్‌తోఫాలు, సంక్రాంతి సంబురాలకు పప్పు బెల్లం పంచడానికి వేలకోట్ల రూపాయలు ఖర్చుచేయడం తగదు.
నిరుద్యోగభృతికి నెలకి అయ్యేఖర్చుతో ఒక్కో జిల్లాలో ఒక్కో నెలలో ఎన్నో ప్రభుత్వ పరిశ్రమలను స్థాపించి, ఉద్యోగాలు సృష్టించవచ్చు. ప్రజల ఆదాయశక్తిని పెంచాలే గానీ వారిని ఎల్లకాలం రుణమాఫీలు, 5రూపాయలకే భోజనం, రూపాయికే కిలో బియ్యం, పింఛన్లు వంటివి ఎవ్వరూ ప్రోత్సహించి ప్రజాధనాన్ని వృధా చేయరాదు. వివాహాలను సింపుల్‌గా చేసుకోవాలి, దుబారా చేయవద్దని, కట్నాలు వద్దని ప్రజలలో మార్పు తేవాల్సిందిపోయి పెళ్లిలకు కూడా ఆడపిల్లలకు ఆర్దికసాయం చేయడం సమంజసం కాదు. ఎన్టీఆర్ ఎన్నో ఏళ్ల కిందట కిలో బియ్యం రెండు రూపాయలని చెప్పాడు. ఇన్నేళ్లు గడిచి, పదిరూపాయలకూ విలువలేని రోజుల్లో రూపాయికి ఇంకా బియ్యం ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం ఎందుకు? సంక్షేమం అనేది విద్య, ఆరోగ్య రంగాలలోనే ఉండాలి.
ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్యసేవల పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులకు కోట్లాది రూపాయలు దోచిపెట్టే బదులు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌళిక సదుపాయాలు, అత్యాధునిక పరికరాలు, డాక్టర్లని నియమిస్తే బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. పనికి, నైపుణ్యానికి తగ్గ ప్రతిఫలం అన్నదాతల నుంచి ప్రతి ఒక్కరికి లభించేలా చూడాలి. అంతేకానీ అభివృద్దిపై దృష్టి పెట్టకుండా సంక్షేమ పథకాలు, కులానికో కార్పొరేషన్లతో నేటి నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారు. పవన్ మేనిఫెస్టోని చూస్తే కూడా ఇదే అర్థం అవుతుంది.
కేవలం వృద్దులు, వికలాంగులకు మాత్రమే ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలి. ఇవ్వన్నీ పవన్ నుంచి ఓటర్లు ఆశించారు. ఎందుకంటే ఎన్నికలలో గెలవాలని, ముఖ్యమంత్రి కావాలనే ఆశ వున్నఎవ్వరూ ఇంతటి ధైర్యమైన నిర్ణయాలు తీసుకోలేరు. పవన్ నేను గెలవడానికి కాదు.. సమస్యలపై పోరాటం చేయడానికి, కొత్త రాజకీయాలకు నాంది పలకడానికి, ప్రశ్నించడానికే వచ్చానన్నాడు కాబట్టి ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులను ప్రజలు పవన్ నుంచి ఆశించారు. కానీ పవన్ నేడు తాను అదే తానులో ముక్కనని నిరూపించుకుంటున్నాడు. ఆయన ఒకసారి రెండు మూడు వేలు ఓటుకి డబ్బులు తీసుకున్నా ఫర్వాలేదు.. ఓటుని మాత్రం జనసేనకే వేయండి అని సాధారణ రాజకీయ నాయకునిలా మాట్లాడాడు.
ఇక తాజాగా ఆయన యువత అంతా ఓటర్లుగా నమోదు చేసుకుని తన సత్తాచాటాలని పిలుపు ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ ఆయన మాత్రం రాష్ట్రంలో 21లక్షల ఓట్లు గల్లంతయ్యాయని వ్యాఖ్యానించాడు. అవన్నీ యువకులవే అని, జనసేనకే ఆ ఓట్లు పడతాయనే భయంతో అధికారపార్టీ వాటిని గల్లంతు చేసిందని ఆరోపిస్తున్నాడు. ఏకంగా 21 లక్షల ఓట్లు అందునా అవ్వన్నీ జనసేనవేనని ఆరోపించడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం.
నాడు ప్రజారాజ్యంకి పోలయిన ఓట్లు కంటే పవన్ గల్లంతయ్యాయని చెబుతున్న ఓట్లు అధికం. పవన్‌కి అన్ని ఓట్లు ఉన్నాయే అనుకుందాం. కానీ వారందరు జనసేన వారేనని ఊహించి గల్లంతు చేయడం సాధ్యమేనా? అది అంత సులభమా? పవన్ కేవలం తన ఓటర్లను జాగృతం చేసి ఓటర్లుగా నమోదు చేయించాలనేది ఈ మాటలలోని ఆంతర్యం. అది మంచిదే గానీ ఇలా తలా తోకాలేకుండా సాధారణ రాజకీయ నాయకునిగా ఆయన మాట్లాడటం సరికాదు అనే చెప్పాలి.