రంగులనేకాదు.. మాటలను కూడా మార్చడంలో బండ్లగణేష్‌ది ప్రత్యేకశైలి. నిజానికి ఎన్టీఆర్ కాకుండా ‘ఊసరవెల్లి’ పేరుతో బండ్లగణేషే హీరోగా చేయాల్సింది. ఇతనని అందరు మిడిగుడ్లు వాడిని నమ్మకూడదు అంటారు. ఇండస్ట్రీలో కూడా ఆయనకు ఉన్న పేరు చాలా మందికి తెలుసు. ఆ మధ్య ఈయన కొంత కాలం కనిపించకుండా పోయి ఉన్నట్లుండి బ్లాక్‌బస్టర్ నిర్మాతనంటూ వచ్చాడు. ఒకానొక వేదికలో తాను ఎవరి తలనైనా నరికి వెళ్లినా బొత్ససత్యనారాయణ తనను కాపాడుతాడని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అందులోనూ బొత్స హవా సాగుతున్న సమయంలో ప్రకటించాడు.
ఇక నిర్మాతగా ఈయన మొదటి చిత్రం రవితేజతో ‘ఆంజనేయులు’ విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్న నేపధ్యంలో నాటి సమైక్యాంద్ర అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు బొత్సని అభినందించి, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారని అభినందించిన మాట వాస్తవం. కానీ ఎంతో కాలం తర్వాత గణేష్ తాను బొత్సకి సన్నిహితుడినే గానీ ఆయనకు బినామీని కాదని, తనకు అంత ఖర్మ పట్టలేదని చెప్పాడు. ఆ తర్వాత తాను కోళ్ల వ్యాపారంలో సంపాదించానని, తర్వాత రియల్‌ఎస్టేట్ బిజినెస్ చేసి సంపాదించానని, తన తండ్రి ఇండియాలోనే కోళ్ల వ్యాపారంలో నెంబర్ వన్ అని చెప్పుకొచ్చాడు.
ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో మాట్లాడుతూ.. నిర్మాతగా తనకి కాస్త గ్యాప్ వచ్చిందని, మరలా టాప్‌స్టార్స్‌తో సినిమాలు తీయనున్నానని ప్రకటించాడు. మరి నీకు వారు కాల్షీట్స్ ఇస్తారా? ఎలా మేనేజ్ చేస్తావు? అని అడిగితే అది తనకు మాత్రమే తెలిసిన విద్య అని, ఆ సీక్రెట్‌ని ఎలా బయటకు చెబుతానని ఆర్కేని ఎదురు ప్రశ్నించాడు. ఇక ఈయన విలువైన బహుమతుల ద్వారానే కాదు.. భజనలు చేసి కూడా ఎంతటి స్టార్‌నైనా మభ్యపెట్టి కాల్షీట్స్ దక్కించుకోవడానికి ఏమైనా చేస్తాడని, ఎంత పనైనా చేస్తాడని అంటారు. కానీ కేవలం మాటలు చెప్పేవాడు కొంత కాలం కొంత మందిని మాత్రమే మభ్యపెట్టగలడు గానీ ఎల్లకాలం అందరినీ మోసం చేయలేడనే సామెత ఈయనకు బాగా వర్తిస్తుంది.
ఇక ఈయన ఏపీలో అయితే తన గురువు బొత్స సాయంతో వైసీపీ తరపున నిలబడి టిక్కెట్ తెచ్చుకుని ఉండేవాడు. కానీ ఆయన తెలంగాణ కాంగ్రెస్‌లో చేరి రాహుల్‌గాంధీతో కండువా వేయించుకున్నాడు. ఇది నిజంగా పవన్ నెత్తి మీద పాలు పోసినట్లే. అయితే ఆయన దేవుడిగా చెప్పుకునే పవన్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. దీనికి మరోకారణం ఉందని అంటున్నారు. ఈయనకు రవితేజ, ఎన్టీఆర్‌లతో కూడా సంబంధాలు సరిగాలేవు. ఇస్తే గిస్తే పవనేకాల్షీట్స్ ఇవ్వాలి. కానీ పవన్ ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నాడు. ఆయన గెలుపుపై బండ్లకు కూడా అనుమానం ఉంది. ఇక పవన్‌తో సినిమా అన్నా కూడా ఎంతో సమయం పడుతుంది. అయినా నాటి పరిస్థితుల్లో పవన్ సినిమాలలో మరలా నటిస్తాడా? లేదా? అనేది అనుమానమే. దీంతో పవన్‌తో ఉపయోగం ఉండదని భావించే ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నాడని అంటున్నారు.
ఇక గత కొన్నిరోజులుగా ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ న్యూస్‌చానెల్ ఇంటర్వ్యూకి వచ్చిన బండ్ల గణేష్ మీడియా ప్రతినిధి ‘జనసేనలో కాకుండా కాంగ్రెస్‌లో ఎందుకు చేరారు?’ అని ప్రశ్నించాడు. దాంతో గణేష్ ‘ఇలాంటి ప్రశ్నలు వేస్తే వెళ్లిపోతాను’ అంటూ బెదిరించాడు. అంతే కాదు ఆయన పారిపోతున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇక నేను చిన్నప్పటి నుంచి నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే అందులో చేరాను అని చెప్పాడు. ‘మరి మీ దేవుడిగా భావించే పవన్ వెంట ఎందుకు నడవడం లేదు’ అంటే.. ‘అది నా వ్యక్తిగతం’ అన్నాడు. అయినా మీరు ఇలాంటి ప్రశ్నలే వేస్తే వెళ్లిపోతాను. అసలు మీ ఇంటర్వ్యూకే రాకూడదని అనుకున్నాను. ఏదో ఒక వివాదం అవుతుందని ముందే అనుకున్నాను అంటూ ఫోన్‌తో సహా లగెత్తాడు.
ఇక ఈయనపై పలు చిల్లర కేసులు కూడా ఉన్నాయి. నటుడు సచిన్‌తో పాటు విజయవాడ, ప్రొద్దూటూరు వంటి చోట్ల పలువురికి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా, వారికి చెల్లని,బౌన్స్ చెక్కులు ఇచ్చాడని అంటుంటారు. మొదట్లో పవన్ దీనికి ఆర్థిక సాయం చేశాడని కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల ప్రొద్దుటూరులో ముఖానికి గుడ్డ కట్టుకుని కోర్టుకి వెళ్తూ, మీడియాకి దొరికిపోయాడు.
ఇక బండ్ల.. కాంగ్రెస్‌లో చేరి పవన్ నెత్తిన పాలు పోశాడని చెప్పాలి. అలీ వంటి వారు ఉంటే పవన్‌పై నమ్మకం పెరుగుతుంది. అదే బండ్ల వంటి వారు పార్టీలో చేరితే ఇప్పటికే సరైన వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం లేదని వస్తున్న విమర్శలు మరింత బలపడేవి. ఇక కాంగ్రెస్‌లో చేరాడు కాబట్టి ఇప్పటికీ కాంగ్రెస్‌పార్టీలోనే ఉన్న అన్నయ్య కాల్షీట్స్ సంపాదించడానికి ప్లాన్ చేశాడో ఏమో ఎవరికి తెలుసు. ఆయన ప్రతి నిర్ణయం వెనుక ఏదో మతలబు మాత్రం ఖచ్చితంగా ఉండే ఉంటుందని కొందరు అనుకుంటుండటం విశేషం.