బాలీవుడ్‌లో విలన్‌గా నటించే శక్తికపూర్ మీద గతంలోనే ఎన్నోఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆయన ఓ నటి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలున్నాయి. 2005లో ఓ నటిని పట్టుకుని అనకూడని మాటలు అంటుండగా కెమెరాలలో రికార్డు అయింది. కానీ ఆ వీడియోను ఎవరో మార్ఫ్ చేశారంటూ నాడు శక్తికపూర్ మండిపడ్డాడు. తాజాగా శక్తికపూర్ తనుశ్రీదత్తా, నానా పాటేకర్‌ల విషయంలో తలదూర్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగామారింది.
తనుశ్రీ దత్తా.. నానా పాటేకర్‌పై చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయం ఏమిటి? అని విలేకరులు శక్తికపూర్‌ని ప్రశ్నించగా.. ‘‘ఈ ఘటన జరిగి దాదాపు పదేళ్లు అవుతోంది. అప్పుడు నేను చాలా పిల్లాడిని. నేనెలా ఈ విషయం గురించి స్పందించగలను?’’ అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలలో తనుశ్రీ దత్తా ఎప్పుడో పదేళ్ల కిందట జరిగిన సంఘటనను ఇంత ఆలస్యంగా చెప్పడం ఏమిటి? అనే వ్యంగ్యం బాగానే ఉంది. మరికొందరు కూడా ఇదే అభిప్రాయాన్నివెల్లడిస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఆడవారికి లైంగిక వేధింపుల వంటివి జరిగితే వాటిని ఎప్పుడైనా వెల్లడించవచ్చు అని అభిప్రాయపడుతున్నారు.
దీంతో తనుశ్రీ దత్తా మద్ధతుదారులు శక్తికపూర్ వ్యాఖ్యలపై మండిపడుతూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. అయినా ఈ విషయంలో అసలు వ్యక్తి అయిన నానాపాటేకరే మౌనం వహిస్తున్నాడు. తాను చట్టప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటానని, మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఏదేదో కల్పించి వివాదాలను పెద్దది చేసి తానుచెప్పేది ఒకటైతే వారు రాసేది మరో విధంగా ఉంటుందని నానాపాటేకరే చెప్పుకొచ్చాడు.
కానీ ఆయనకు మద్ధతు తెలుపుతున్న వారు మాత్రం మౌనం వహించకుండా ఏదేదో మాట్లాడుతూ, చివరకు తాము మద్దతు ఇస్తోన్న నానాకే చేటు చేస్తున్నారని చెప్పకతప్పదు. ఇలాంటి విషయాలలో నానా మద్ధతుదారులు కూడా ఆయనకు సంఘీభావం ప్రకటించాలంటే మౌనంగా ఉంటూ చట్టప్రకారం చర్యలు తీసుకోవడమే ఉత్తమమని గ్రహించాల్సి ఉంది...!