విజయ్ దేవరకొండ తమిళ డెబ్యూ నోటా మూవీ నిన్న శుక్రవారం తెలుగులో కూడా విడుదలైంది. అయితే తెలుగులో నోటా మూవీకి యావరేజ్ టాకొచ్చింది. ఈ సినిమాలో విజయ్ నటనకు, సినిమాటోగ్రఫీకి, కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కి పాజిటివ్ టాక్ రాగా... కథ, కథనం బలహీనంగా ఉండడం, హీరోయిన్ మెహ్రీన్ పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోవడం, శ్యామ్ అందించిన పాటల్లో ఒక పాట కూడా తెలుగులో ఇంట్రెస్ట్ పుట్టించే విధంగా లేకపోవడం, ఇక ఆనంద్ శంకర్ డైరెక్షన్ స్కిల్స్ బలహీనంగా ఉండడం, సెకండ్ హాఫ్ మొత్తం సాగదీతగా.. తమిళ రాజకీయాలకు దగ్గరగా ఉండడం వంటి నెగటివ్ పాయింట్స్ తో నోటా సినిమాకి తెలుగులో యావరేజ్ టాక్ పడింది. విజయ్ క్రేజ్ కూడా నోటా కలెక్షన్స్ పెంచే విధంగా లేదని.. రివ్యూ రైటర్స్ కూడా ముక్త ఖంఠంతో చెబుతున్న మాట. అయితే నోటా టాక్ మరో హీరోల పాలిట వరంగా మారనుందా అంటే కాస్త అటు ఇటుగా అవుననే మాటలే వినబడుతున్నాయి.
గత వారం విడుదలైన నాని - నాగార్జున ల మల్టీస్టారర్ మూవీ దేవదాస్ సినిమాకి యావరేజ్ టాక్ రావడం.. నాగార్జున క్రేజ్, నాని క్రేజ్ కూడా దేవదాస్ కలెక్షన్స్ ని కాపాడలేకపోయాయి. కానీ నిన్న విడుదలైన నోటా టాక్ తో కాస్త కామెడీ కలగలిపిన దేవదాస్ కలెక్షన్స్ మళ్ళీ పెరిగే అవకాశాలున్నాయనుకుంటుంది దేవదాస్ టీం. దేవదాస్ సినిమా విడుదలవక ముందు రోజే ఫ్యామిలీతో స్పెయిన్ చెక్కేసి నిన్నటి వరకు హాలీడేస్ ని ఎంజాయ్ చేసిన దేవా అదేనండి నాగార్జున నోటా టాక్ తో దేవదాస్ ప్రెస్ మీట్ పెట్టించి మరీ సినిమాకి ప్రమోషన్ చేస్తున్నట్లుగా కనబడుతుంది. నిన్న పొద్దున్న నోటా విడుదలై యావరేజ్ టాకొచ్చేసరికి సాయంత్రానికల్లా దేవదాస్ నిర్మాత అశ్వినీదత్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో కలిసి నాగార్జున దేవదాస్ ప్రెస్ మీట్ పెట్టాడు. మరి నోటా టాక్ వాళ్ళకి కలిసొస్తుందని ఆశతోనే మళ్ళీ దేవదాస్ ప్రెస్ మీట్ పెట్టినట్లుగా కనిపిస్తుంది కదా.. చూద్దాం నోటా టాక్ నాగ్ కి నానికి ఎంతవరకు కలిసొస్తుందో అనేది. మరి విజయ్ క్రేజ్ ముందు దేవ్, దాస్ ల పప్పులు ఎంతవరకు ఉడుకుతాయో చూద్దాం.