బిగ్‌బాస్ రియాల్టీషో మొదలవుతుందని తెలిసిన తర్వాత ఇలాంటి వాటిని మన తెలుగువారు ఆదరిస్తారా? అనే అనుమానాలు వచ్చాయి. అయితే హిందీ, కన్నడలో హిట్ అయిన దృష్ట్యా కాస్త అటు ఇటుగా తమిళ, తెలుగు బిగ్‌బాస్‌లు మొదలయ్యాయి. తమిళంలో ఏకంగా లోకనాయకుడు కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఉంటే ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ అలరిస్తాడా? లేదా? అనే ప్రాధమిక సందేహాలు తలెత్తాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ కమల్‌హాసన్ కంటే యంగ్‌టైగరే బిగ్‌బాస్ సీజన్1ని తనదైన సరదా మాటలతో, సమయస్ఫూర్తితో రంజుగా నడిపించాడు. అదే సమయంలో ఎన్టీఆర్ ముందు కమల్‌హాసన్ తేలిపోయాడని కూడా కొందరు వాదించారు. మొత్తానికి మొదటి సీజన్ విజయవంతం కావడంలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో కీలకమైంది. ఈ షోకి ఎన్టీఆర్ వల్లనే విపరీతమైన టీఆర్పీ రేటింగ్స్ వచ్చి, మా కాస్తా స్టార్‌మాగా మారిన తర్వాతనే బాగా క్రేజ్ తెచ్చుకుంది. నిజానికి మీలో ఎవరు కోటీశ్వరుడు కంటే స్టార్‌మాకి బిగ్‌బాస్ విజయమే ఎక్కువ ఫలితాలను అందించింది.
ఇక తమిళంలో రెండో సీజన్ బాధ్యతలను కూడా కమల్‌హాసన్‌కే అప్పగించినా తెలుగులో మాత్రం ఎన్టీఆర్ 'నో' చెప్పిన కారణంగా నేచురల్‌స్టార్ నానిని హోస్ట్‌గా పెట్టుకున్నారు. చిన్న చిన్న చిత్రాలు, పాత్రల నుంచి ఎదుగుతూ నేచురల్‌స్టార్ స్థాయికి ఎదిగిన నాని కూడా మంచి మాటకారి కావడంతో సీజన్2 కూడా బాగా క్లిక్ అయింది. అయితే ఈ సీజన్2 మొదలైన రెండు మూడు వారాలలోనే కౌశల్ ఆర్మీ ఏర్పాటు కావడం, కౌశల్‌ఆర్మీ షోని శాసించడం మొదలైంది. కాస్త కౌశల్‌పై ఒకసారి కోపం ప్రదర్శించినందుకు ఏకంగా కౌశల్ ఆర్మీ.. నానిని కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో నాని తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడని కూడా ప్రచారం జరిగింది. ఇందులో నిజం కూడా ఉంది. అందుకే నాని ఆ తర్వాత కౌశల్ పట్ల చాలా మెతకగా వ్యవహరించాడు. చివరలో అయితే అసలు ఆయన్ను పెద్దగా పట్టించుకోవడం కూడా మానివేశాడు. ఇక మూడున్నర నెలలు ఎంతో టెన్షన్ అనుభవించానని, దేవదాస్ ప్రమోషన్స్‌లో చెప్పిన మాట దీనికి అద్దం పడుతుంది. దీంతో నాని సీజన్3కి అసలు ఒప్పుకోడనేది తేలిపోయింది.
ఇక సీజన్2 ముగిసిందో, లేదో అప్పుడే సీజన్3 మీద ప్రేక్షకులు ఫోకస్ పెట్టారు. సీజన్3కి ఎవరు హోస్ట్‌గా వ్యవహరిస్తారు? అనే విషయంపై చర్చసాగుతోంది. దీనిలో స్టార్స్ అయిన అల్లుఅర్జున్, విజయ్‌దేవరకొండ, రానాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గతంలో 'యే నెంబర్ వన్ యాహీరే' అనే షోకి హోస్ట్‌గా పనిచేసిన అనుభవం రానా సొంతం. తాజాగా ప్రారంభమైన 'పెళ్లిచూపులు'కి కూడా మొదట రానానే భావించారని, కానీ సినిమాల బిజీ వల్ల ఆయన నో చెప్పడం వల్ల యాంకర్ ప్రదీప్‌తో చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు టాప్‌స్టార్స్‌లో ఒకరైన అల్లుఅర్జున్ కూడా ఎన్టీఆర్ స్థాయి వాడే. ఇంకో వైపు విజయ్‌దేవరకొండ కూడా నేడు నాని స్థాయికి చేరుకున్నాడు. ఈ ముగ్గురిలో ఎవరైనా సరే షోని రక్తికట్టించే ప్రతిభాపాటవాలు ఉన్నాయి. తెలుగు బిగ్‌బాస్‌లో సీజన్‌కో హోస్ట్ రావడం అనేది సీజన్3కి కూడా ఖాయమని అంటున్నారు. మరి ఈ ముగ్గురిలో నిర్వాహకులు ఎవరిని ఎంచుకుంటారు? ఆ సమయానికి ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం ఏమైనా జరుగుతుందా? మరొకరు వెలుగులోకి వస్తారా? అనేవి చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే ఊహించడం సాధ్యం కాదనే చెప్పాలి.