టాలీవుడ్‌లో సినిమాల విడుదల కంటే ముందుగా లీక్‌లు నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అత్తారింటికి దారేది నుంచి బాహుబలి, 2.ఓ, గీతగోవిందం, అరవింద సమేత' వంటి ఎన్నో చిత్రాలు దీనికి బలయ్యాయి. అయితే వీటిల్లో అత్యధిక చిత్రాలు విజయమే సాధించాయి. అందునా ప్రతి లీక్‌లోనూ ఇంటి దొంగలు, ఎడిటింగ్ టేబుళ్ల వద్దనే లీక్ అయ్యాయని నిరూపితం అవుతోంది. కొందరైతే వీటిని పబ్లిసిటీ స్టంట్‌గా, సినిమాకి మరింత క్రేజ్, సానుభూతి, సినిమాలోని కొన్ని ప్రేక్షకులను అలరిస్తాయని గ్యారంటీగా నమ్మే సీన్స్ మాత్రమే లీక్ అవుతున్నాయని, కొందరు ముందుగానే లీక్‌ల విషయం కూడా ఒప్పుకుంటున్నారని, ఇది కోలీవుడ్‌లో మరింత ఎక్కువగా ఉందని వాదించే వారు కూడా ఉన్నారు. సినిమా విడుదలకు ముందే సినిమాలోని క్లైమాక్స్ వంటి వాటిని అఫీషియల్‌గా రిలీజ్ చేస్తూ మరింత మంది గేమ్స్ ఆడుతున్నారు. ఇక తెలుగులో సెన్సేషనల్ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ యూటిట్యూడ్, ఆయన మాటల నుంచి చేతల వరకు సెన్సార్‌పై విమర్శల నుంచి వి.హన్మంతరావు, బూతు పదాల వరకు తనదైన శైలిలో సినిమాపై అంచనాలు పెంచుతూ ఉంటాడు.
ఇక విషయానికి వస్తే ఆయన నటించిన చిత్రం 'ట్యాక్సీవాలా'. ఈ చిత్రం 'గీతగోవిందం'కంటే ముందుగానే విడుదల కావాల్సి ఉంది. కానీ సీజీవర్క్ నచ్చకపోవడంతో ఆ బాధ్యతలను మరో సంస్థకి అప్పగించారు. ఇంతలో అక్టోబర్ 5న 'నోటా' విడుదల కానుంది. ఇలా సినిమా ఆలస్యం అయ్యే కొద్ది సినిమాపై ప్రేక్షకులకు నెగటివ్ అభిప్రాయం వస్తుంది. అందుకే ఆ ప్రమాదం జరగకుండా 'ట్యాక్సీవాలా'ని వార్తల్లో ఉంచడానికే కొందరు ఇంటి దొంగలు ఈ పని చేశారనే వాదన ఉంది. దీనితో కొందరు ఏకీభవించవచ్చు. కొందరు ఖండించవచ్చు. ఇక ట్యాక్సీవాలా చిత్రం మొత్తం ఆన్‌లైన్‌లోకి వచ్చేసిందని అంటున్నారు. కానీ ఆ నాలుగు గంటల ఫుటేజీలో డైలాగ్స్, రీరికార్డింగ్, సీజీ వర్క్‌లు లేకపోవడం వల్ల నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారట.
దీంతో పశ్చిమగోదావరి జిల్లా దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లాలోని ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేశారట. ఇక ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి. 'అత్తారింటికి దారేది' విడుదల సమయంలో ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల వల్ల సినిమాని విడుదల చేసే పరిస్థితులు లేవని, అందుకే నాడు యూనిటే లీక్ చేసి సినిమాని విడుదల అయ్యేలా చేసిందనే విమర్శ కూడా ఉండనే ఉంది...!