దర్శకునిపై నమ్మకం ఉంటేనే సినిమా ఒప్పుకోవాలి. నిర్మాతలకు కూడా ఇదే వర్తిస్తుంది. కానీ 'దేవదాస్' చూసిన తర్వాత మన మేకర్స్ ఇలా ఆలోచించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. మొదటి నుంచి నాగార్జున మీద ఉండే విమర్శ ఏమిటంటే. ఆయన ఎడిటింగ్ టేబుల్ దగ్గర విపరీతంగా జోక్యం చేసుకుంటాడని, 'రాజు గారి గది' వంటి చిన్న చిత్రం హిట్టయిందంటే అందులోని ఎంటర్‌టైన్‌మెంట్ ముఖ్యంకాదు. అదే రాజుగారి గది2 చిత్రంలో నాగ్, సమంతలు నటించినా కూడా సీరియస్ సబ్జెక్ట్‌లో కామెడీ వద్దని నాగ్ తొలగించాడనేది అందరికీ తెలిసిన విషయమే. అదే చిత్రం పెద్దగా ఆడకపోవడానికి కారణమైంది. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక తాజాగా 'దేవదాస్' ప్రమోషన్లలో నాగ్ మాట్లాడుతూ, దర్శకుడు శ్రీరాం ఆదిత్య సోమరి. ఆయన చాలా ఆలస్యంగా చిత్రాన్ని నాకు చూపించాడు. ఇక ఆ సమయంలో ఎవరు మాత్రం ఏమి చేయగలరు? అని వ్యాఖ్యానించాడు.
ఇక ఈ సినిమా ఎడిటింగ్‌లో అందరు వేలు పెట్టారని, అందుకే సినిమా కేవలం నాగ్, నానిలు తప్ప కథపై దృష్టి పెట్టలేదని అర్ధం అవుతోంది. వీరిద్దరి పాత్రలను చూపి ఎంటర్‌టైన్‌మెంట్ పండించడానికి పడిన కష్టం. కథ, ఇతర పాత్రధారులు, అనవసరమైన మాఫియా బ్యాక్‌డ్రాప్‌లు చూస్తే అర్ధం అవుతోంది. ఇక విషయానికి వస్తే తాజాగా ఈ చిత్రం నుంచి ఎడిటింగ్‌లో తొలగించిన ఈ సీన్‌ని నాని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. కార్పొరేట్ ఆసుపత్రులలో జరుగుతున్న మోసాలపై నాని, రావు రమేష్‌తో వాదనకు దిగే ఈ సీన్ అద్భుతంగా ఉంది. నాగార్జునతో, నాని గొడవ పడిన తర్వాత మరలా తాను ముందుగా పనిచేసిన ఆసుపత్రికి వచ్చి రావు రమేష్‌ని ఉద్యోగం అడుగుతాడు. అతను అవమానకరంగా మాట్లాడి నానిని గెంటివేస్తాడు. వెళ్తూ వెళ్తూ వెనక్కి వచ్చి నాని ఉద్వేగంతో ఎంతో ఎమోషనల్‌గా అందరినీ ఉతికి ఆరేస్తాడు.
'నేను బయట ఎన్నికేసులు డీల్ చేశానో తెలుసా? పేపర్‌తో గొంతు కోయొచ్చని తెలుసా? ఈ చేతులతో ఎన్ని బుల్లెట్లు తీశానో తెలుసా? అంటూ సాగే సీన్ హైలైట్‌గా ఉంది. సినిమాలో ఇలాంటివే నాని సీన్స్ పలు ఎడిటింగ్‌లో లేచిపోయాయని, అందులో నాని ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన సీన్స్ కూడా ఉన్నాయని, దాంతోనే నాని హర్ట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఎంత మంచి నటుడైనా తాను ఎంతో బాగా నటించిన సీన్ చిత్రంలో ఉంటే అది ఇచ్చే కిక్కుని పారితోషికం కూడా ఇవ్వలేం. మరి 'భరత్ అనే నేను'లో కూడా ఇలాగే జరిగింది. మరి వీటిని డిజిటల్‌లోనైనా ఉంచుతారా? ఆ భాగ్యం కల్పిస్తారో లేదో చూడాలి..! ఇలాంటి చిన్నపొరపాట్లే సినిమా టాక్‌ని ప్రభావితం చేస్తాయనేది వాస్తవం.