ఏ హీరోకైనా మొదటి పదేళ్ల కాలంలో అనుభవ రాహిత్యం వల్ల గానీ మరే ఇతర పొరపాట్ల వల్ల గానీ ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. ఆ అనుభవాలతో తనకి అప్పటి వరకు ఏర్పడిన ఫ్యాన్ బేస్, ఇమేజ్, క్రేజ్‌లను అర్ధం చేసుకుని మరింత జాగ్రత్తగా అడుగులు వేయడం అనేది రెండో దశాబ్దంలో చాలా కీలకం అవుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ముద్దుల తనయుడిగా తెలుగు తెరకు 'చిరుత' ద్వారా పరిచయం అయి మొదటి చిత్రంలోనే మెగాపవర్‌స్టార్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకున్న రామ్‌చరణ్ ఉరఫ్ చెర్రీ ఉరఫ్ మిస్టర్‌సీ రెండో చిత్రం 'మగధీర'తోనే చరిత్ర సృష్టించాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన గాడి తప్పుతూ వచ్చాడు. 'ఆరెంజ్, జంజీర్(తుఫాన్), బ్రూస్‌లీ' చిత్రాలు చేదు అనుభవం మిగిల్చాయి. అంత తొందరగా ఆయన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం, అందునా అమితాబ్ నటించిన క్లాసిక్ 'జంజీర్'ని రీమేక్ చేయడం పెద్ద పొరపాటు.
ఇక ఆ తర్వాత కూడా 'రచ్చ, నాయక్, ఎవడు' వంటి చిత్రాలన్నీ విజయాలను అందించినా ఆయన కేవలం మాస్ కోసం మూసలో చిత్రాలు చేస్తున్నాడనే అపవాదు వచ్చింది. 'గోవిందుడు అందరివాడేలే' మంచి ప్రయత్నమే అయినా సక్సెస్ కాలేదు. అలాంటి సమయంలో ఆయన వైవిధ్యం నిండిన 'తని ఒరువన్'ని, 'ధృవ' పేరుతో రీమేక్ చేయడం, 'రంగస్థలం' వంటి సాహసం ఆయనలోని నటుడిని వెలికితీసి సగర్వంగా నిలిపాయి. అంటే ఆయన 10ఏళ్ల కెరీర్ కన్నా గత ఏడాదిలో ఆయనలో ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. ఇక చెర్రీ ఇటీవల నటునిగా తన 11వ ఏటను చేసుకున్నాడు.
దాంతో ఆయన శ్రీమతి ఉపాసన ముద్దుగా మిస్టర్‌సికి శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆసక్తికర ట్వీట్ చేసింది. 'మిస్టర్ సి.. మై లవ్..నీ' జర్నీలో 11ఏళ్లు పూర్తి చేసుకున్నావు. ఫేమ్‌ని, సక్సెస్‌ని, ఫెయిల్యూర్‌ని ఓ పద్దతిగా హ్యాండిల్ చేస్తున్న నీ తీరును నేను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ, బలంలో ఆశ్రయం తీసుకోవడం నేర్చుకున్నాను. తదుపరి 11ఏళ్లు కూడా నీతో షేర్ చేసుకోబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపింది. రాబోయే 11ఏళ్లేగాదు.. జీవితాంతం జీవితాన్ని ఈ ఇద్దరు బెస్ట్ కపుల్స్ మరింతగా సక్సెస్‌ఫుల్‌గా జరుపుకోవాలని ఆశిద్దాం..!