ప్రస్తుతం చానెల్స్, మీడియా, సోషల్‌మీడియా, స్మార్ట్ ఫోన్ల వంటివి ఇంటి నట్టింట్లోకి కూడా వచ్చేశాయ్. వాటిని తల్లిదండ్రులు, పెద్దలు కూడా ఆపలేకపోతున్నారు. ఇది నిజంగా పెద్దల వైఫల్యమే అని చెప్పడం సరికాదు. సమాజంలో మంచి కంటే చెడు వేగంగా ప్రయాణించడమే కాదు.. ఆకట్టుకుంటుంది. మరి ప్రయోజనాల కోసం ఫోన్లు కొనిస్తే పిల్లలు ఇంట్లో కాకపోయినా బయట అయినా చూడకూడని వాటికి అట్రాక్ట్ అవుతారనేది నిజం. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా పెద్దలు కూడా విశాల దృక్పధంతో ఆలోచించాలి. ఇటీవల ఇదే విషయంపై నాగార్జున ‘దేవదాస్’ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్100 వంటి చిత్రాలు రావడంలో తప్పులేదని, పిల్లలకు ఫోన్లు ఇచ్చే వారు వారిపై మాత్రం నిఘా పెట్టరని, కానీ సినిమాలో అసభ్యమైన సీన్ వస్తే సినిమాలు చెడగొడుతున్నాయని అంటున్నారని వ్యాఖ్యానించాడు. పనిలో పనిగా ఆయన ఓ విషయం కూడా చెప్పాడు.
పిల్లలు చూడలేని చిత్రాలకు వారిని తీసుకెళ్లవద్దని, పెద్దలు మాత్రమేచూడాలని ఉచిత సలహా పడేశాడు. ఇందులో ఒక కోణం మాత్రమే ఉంది. సినిమాలు నేడు సోషల్‌మీడియా, స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ మీడియా పుణ్యమా అని పడకగదిలోకి కూడా వచ్చేసిన సందర్భంలో పిల్లలను కేవలం అలాంటి సినిమాలు చూడవద్దని థియేటర్‌కి తీసుకెళ్లకుండా ఉన్నంత మాత్రాన ఇవి ఆగుతాయా? ఏదో విధంగా ఇవి పిల్లలకు చేరి మనసులను కలుషితం చేస్తున్నాయి. తాజాగా సల్మాన్‌ఖాన్ దీనికి సరైన సమాధానం ఇచ్చాడు.
1989లో ‘మైనే ప్యార్‌కియా’ ద్వారా స్టార్‌గా మారి రోజు రోజుకి వయసు పైబడుతున్నా, తాను వచ్చి ఎన్నోఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికీ తన క్రేజ్‌ని విపరీతంగా పెంచుకుంటున్న స్టార్ సల్మాన్. ఆయన చిత్రాలలో పాటలు, ఫైట్స్, కథ అని ప్రత్యేకంగా ఉంటాయి. ఏ తరహా చిత్రంలోనైనా తన మార్క్‌ని చూపించే ఆయన శృంగారభరితమైన సీన్స్ చేయడానికి మాత్రం ఒప్పుకోడు. మొదటి నుంచి ఇదే మాట చెబుతూ ఉన్న ఆయన ఇప్పటికీ దానినే పాటిస్తున్నాడనే విషయం ఆయన నటించిన చిత్రాలు చూస్తే అర్ధం అవుతుంది. ఈ తరహా సన్నివేశాలకు మీరు ఎందుకు దూరంగా ఉంటారని ఓ విలేకరి అడిగితే ఆయన మాట్లాడుతూ..ఓ సారి మా ఇంట్లో మేమందరం కలిసి ఓ హాలీవుడ్ మూవీ చూస్తున్నాం. ఆ సమయంలో నటీనటులు ముద్దు పెట్టుకునే సీన్ వచ్చింది. మేమందరం ఒక్కసారిగా తలలు తిప్పేశాం. ఎందుకంటే కుటుంబసభ్యులతో కలిసి చూసేటప్పుడు ఇలాంటి సీన్స్ ఇబ్బందికరంగా మారుతాయి. అసహ్యంగా ఉంటుంది. అందుకే సినిమాలలో అలాంటి సన్నివేశాలు ఉండకూడదనేది నా సిద్దాంతం. సినిమాలు విజయవంతం కావడానికి ఇలాంటి గిమ్మిక్స్ అవసరం లేదని నేను నమ్ముతాను. ‘మైనే ప్యార్‌కియా’ షూటింగ్ చిత్రీకరణ సమయంలో నేను భాగ్యశ్రీ కాళ్లకి జండుబామ్ రాయాల్సివచ్చింది. ఆ సన్నివేశంలో నటించేటప్పుడు కళ్లు మూసుకుని నటించాను అని గుర్తు చేసుకున్నారు. ఇక సల్మాన్ ప్లేబోయా, ఎందరితో ఎఫైర్లు నడిపాడనేది ఆయన వ్యక్తిగతం. దానిని మనం ప్రశ్నించకూడదు. మొత్తానికి సల్లూభాయ్ ఈ విషయాన్ని అద్భుతంగా చెప్పాడని ఒప్పుకోవాలి.