ఈ మధ్య ఇతర భాషా చిత్రాల నుంచి మూల కథాంశాన్ని తీసుకున్నా కూడా దానిని ఒప్పుకోవడానికి మన మేకర్స్ ఆసక్తిచూపడం లేదు. దాంతో సినిమా విడుదల తర్వాత ఆ టాక్ కాస్తా నెగటివ్‌గా మారుతోంది. ‘అజ్ఞాతవాసి’లో ఈ విషయం రుజువైంది. ఇక తాజాగా ‘దేవదాస్’లో కూడా ఇదే నిజమని తేలింది. హాలీవుడ్ చిత్రం ‘ఆనలైజ్ థీస్’తో పాటు ఓ హాలీవుడ్ చిత్రం స్ఫూర్తి అని ఒప్పుకుని మరీ మమ్ముట్టి మలయాళంలో చేసిన ‘భార్గవ చరితం మూలం కాండం’ కూడా ‘దేవదాస్’కి నకలే. సీన్ టు సీన్ కాపీ కొట్టకపోయినా ఇది వాస్తవం. కానీ శ్రీరాం ఆదిత్య ఈ విషయాన్ని ఖండిస్తూ వచ్చాడు. దీని మూలంగా కూడా చిత్రానికి అనుకున్న టాక్ రాలేదని చెప్పవచ్చు. ఈ సినిమా అసలు సత్తా ఏమిటో ఈరోజు(సోమవారం) నుంచి తేలిపోనుంది.
ఇక తాజాగా దర్శకుడు శ్రీరాం ఆదిత్య మాట్లాడుతూ.. ‘‘దేవదాస్ చిత్రం మొదట చూసి మెచ్చుకున్నది నాగార్జున గారే. ఇద్దరు హీరోలు ఒకేసారి తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు ఎంత సంతోషంగా ఉంటుందో ఆన్‌లోకేషన్‌లో మాకు కూడా అంతే. మానిటర్‌లో నాగ్-నానిలను చూసి ఎంతో ఆస్వాదించాను. థియేటర్‌కి వెళ్లి చూస్తే చప్పట్లతో, కాగితాలు విసిరేస్తూ ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేయడం చూశాను. చిన్నప్పుడు వైజయంతి బేనర్ అంటే భలే ఇష్టం. ఆ సంస్థలోనే పనిచేయడం అనుకోని అనుభూతి. అశ్వనీదత్ గారు పిలిచి కథ చెప్పారు. లైన్ బాగుంది. రెండు మూడు నెలలు కూర్చుని స్క్రిప్ట్ రెడీ చేశాను.
నాగార్జున ఓ ప్రత్యేకమైన స్టార్. ఆయనకో ఇమేజ్ ఉంది. నాని విభిన్నమైన నటుడు. వారిద్దరికి సరైన ప్రాధాన్యం ఇస్తూనే వారి ఇమేజ్‌కి తగ్గట్టు తీయాలనుకున్నాను. నిర్మాణాంతర కార్యక్రమాలకు నేను ఎక్కువ సమయం తీసుకుంటా. దాంతో నాగ్‌సార్‌కి ఆలస్యంగా చూపించా. అందుకే ఈయన సోమరి అని నన్ను అన్నారు. ఏకథ అయినా హాస్యం ఉండాలనేది నా రూల్. హాలీవుడ్ చిత్రాలను చూసి ఆస్వాదిస్తానే కానీ స్ఫూర్తిగా తీసుకోవడం ఉండదు. తదుపరి చిత్రం ‘దేవదాస్’కి కొనసాగింపుగా ఉంటే బాగుంటుంది. త్వరలో నా తదుపరి చిత్రం గురించి చెబుతాను..’’ అని చెప్పుకొచ్చాడు.