సినిమా అనేది ఒక సృజనాత్మక రంగం. కథను తయారు చేసుకునేటప్పుడు ఆయా దర్శకుల మదిలో ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే విజువాలిటీ ఉంటుంది. ఇలాంటి సృజనాత్మకత, ఊహాశక్తి ఉన్నవారే దర్శకులుగా మంచి పేరు సాధిస్తారు. తమదైన శైలిలో పాత్రలను ముందుగా తీర్చిదిద్ది, దానికి తగ్గ బాడీలాంగ్వేజ్, సంభాషణలు ఊహించుకుంటారు. కానీ అదే ఒక చిత్రానికి మొదట దర్శకత్వం వహించింది కొందరైతే ఆ తర్వాత పలు కారణాల వల్ల దర్శకులు మారుతూ ఉంటారు. అలాంటి సమయంలో ముందున్న దర్శకుడి ఆలోచనలను కొత్తగా వచ్చిన దర్శకులు ఆచరణలో పెట్టడం సాగే పనికాదు. అందుకే డైరెక్టర్ ఈజ్‌ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు.
గతంలో విధిలేని పరిస్థితుల్లో ‘అల్లూరి సీతారామరాజు, ప్రేమపుస్తకం’ వంటి చిత్రాలతో పాటు ఎన్నో చిత్రాల దర్శకులు మారారు. కానీ నేడు మాత్రం ఇలా జరగడం కేవలం క్రియేటివ్ డిఫరెన్స్‌ల వల్ల రావడం బాధాకరం. దర్శకునిలో సత్తా నచ్చి, అతడిని పూర్తిగా నమ్మి ఆయన మాటలకు, ఆలోచనలకు విలువ ఇస్తేనే ఏ చిత్రానికైనా సరైన అవుట్ పుట్ వస్తుంది. ఇక నేటి క్రియేటివ్ దర్శకులుగా పేరుతెచ్చుకున్న ముగ్గురు దర్శకుల విషయంలో ఇలాగే జరుగుతుండటం బాధాకరం.
‘క్వీన్’ రీమేక్ నుంచి నీలకంఠ తప్పుకున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ తప్పుకున్నాడు. ఇక కంగనారౌనత్ రాణి ఝాన్సీలక్ష్మీబాయ్ బయోపిక్‌గా రూపొందుతున్న ‘మణికర్ణిక’ నుంచి క్రిష్‌ని తప్పించి ఆమె దర్శకత్వం చేసుకుంటోంది. విచిత్రంగా ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ చేతులోకి వచ్చింది. ఇక ‘మణికర్ణిక’ విషయానికి వస్తే ఆమె స్వయంగా దర్శకత్వం చేసుకుంటూ ఉండటంతో ఈ చిత్రం ఫలితంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌లోనే కంగనా స్టామినా ఏంటో కాస్త తెలిసిపోతుంది. అన్నం ఉడికిందా? లేదా? అనేది ఒక మెతుకు చూసిన వెంటనే తెలిసినట్లు ఈ టీజర్ ద్వారా కంగనాపై ఓ అంచనాకు రావచ్చు. ఇక గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న ‘మణికర్ణిక’ టీజర్ విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని జనవరి 25న రిపబ్లిక్‌డే కానుకగా విడుదల చేయనున్నారు. దీనికి కొన్నిరోజుల ముందే సంక్రాంతికి ‘ఎన్టీఆర్’ బయోపిక్ విడుదల కానుంది. మరి ఈ రెండు చిత్రాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి...!