సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ అక్టోబర్ 5 న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశాడు. అందుకు విజయవాడలో పబ్లిక్ మీట్ ఏర్పాటు చేసి సినిమా రేంజ్ ని మరింత పెంచాడు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, మెహ్రీన్ కౌర్ విచ్చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు.
మెహ్రీన్ మాట్లాడుతూ... ‘‘ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.. ఈ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. నేను అర్జున్ రెడ్డి ఫ్యాన్ ని. విజయ్ దేవరకొండతో నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎంతో కష్టపడే వ్యక్తి ఆయన. నిజంగా ఇలాంటి హీరోని నేను ఇంత వరకు చూడలేదు. తెలుగు, తమిళంలో ఒకేసారి ఇద్దరం వస్తున్నాం. తెలుగు నా కన్నతల్లి లాంటిది. తమిళ్ లో కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను..’’ అన్నారు..
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘విజయవాడకి చాలా రోజుల తర్వాత వచ్చా. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత ఇప్పుడే వచ్చా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విజయవాడలో అందరికి ఇష్టమైనది.. సినిమా.. రాజకీయం. అలాంటి ఈ సినిమా, రాజకీయాల్ని కలిపి వస్తున్న పవర్ ఫుల్ జబర్దస్త్ సినిమా నోటా. ఈ సినిమా ద్వారా మీ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాని అందిస్తున్నామని చెప్తున్నాను. అక్టోబర్ 5న ఈ సినిమా వస్తుంది. ఇంకా నాలుగే రోజులు ఉంది. థియేటర్‌లో కలుద్దాం. చూద్దాం.. సినిమా ఎలా ఉంటుందో.. మంచి స్క్రిప్ట్ తో, పవర్ ఫుల్ డైలాగ్స్ తో వస్తున్న సినిమా నోటా. మా సినిమాని అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. బయట ఉన్నవాళ్ళని చూడలేకపోతున్నాను. సారీ.. నెక్స్ట్ టైం ఇంకా పెద్ద హాల్ ఏర్పాటు చేస్తా. ఇంత చిన్న హాల్ సరిపోదు. క్షమాపణ చెప్తున్నాను. అందరు జాగ్రత్తగా వెళ్ళండి..’’ అన్నారు.