తెలుగులో అభిరుచి ఉన్న నిర్మాతల్లో దొరస్వామిరాజు ఒకరు. ఈయన తన విఎంసీ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా తీసినవి ఆరే చిత్రాలైనప్పటికీ ఆణిముత్యాల వంటి చిత్రాలను నిర్మించారు. ఇక ఈయన నిర్మాతగా మారి మొదట అక్కినేని నాగార్జునతో ‘కిరాయిదాదా’ తీశాడు. ఇది 1987లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ తర్వాత క్రాంతికుమార్ దర్శకత్వంలో అక్కినేనినాగేశ్వరరావుతో ‘సీతారామయ్యగారి మనవరాలు’, నాగార్జునతో ‘ప్రెసిడెంట్‌గారి పెళ్లాం’, నాగార్జున -కె.రాఘవేంద్రరావులతో ‘అన్నమయ్య’, రాజమౌళి-ఎన్టీఆర్‌లతో ‘సింహాద్రి’ చిత్రాలను తీశాడు. అన్ని చిత్రాలు అద్భుతమైన విజయం సాధించాయి. చివరగా ఆయన సీనియర్ వంశీతో ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ తీస్తే పెద్దగా ఆడలేదు. ఆతర్వాత ఆయన సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నాడు.
ఇక ‘కిరాయిదాదా’ విషయానికి వస్తే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా అమల, ఖుష్బూ నటించారు. నిజానికి అందరూ నాగార్జున-అమలల ప్రేమ ‘శివ, ప్రేమయుద్దం’ సమయంలో మొదలైందని అనుకుంటారు. కానీ ఈ రెండు చిత్రాలు 1989-90లలో వచ్చాయి. కానీ ‘కిరాయిదాదా’ 1987లోనే వచ్చింది.
ఇక తాజాగా దొరస్వామిరాజు మాట్లాడుతూ.. ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రం ద్వారా మీనాని పరిచయం చేశాను. అంతకు ముందు ‘కిరాయిదాదా’ చిత్రంతో అమలను ఇంట్రడ్యూస్ చేశాను. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే నాగార్జున, అమల ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుంటామంటే తిరుపతిలో దగ్గరుండి వివాహం జరిపించాను. వారంతా ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు. అది నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. కాగా అమలని నటిగా మొదట పరిచయం చేసింది మాత్రం టి.రాజేందర్. ఆయన ఓ తమిళ చిత్రం ద్వారా అమలను నటిగా పరిచయం చేశారు.