మెగాస్టార్ తనయునిగా మొదటి చిత్రం నుంచి తండ్రి బిరుదులోని మెగాని బాబాయ్ బిరుదులోని పవర్‌ని కలిపి 'మెగాపవర్‌స్టార్'గా రామ్‌చరణ్ పరిచయం అయ్యాడు. ఆయన నటించిన మొదటి చిత్రం పూరీజగన్నాథ్ దర్శకత్వం వహించిన 'చిరుత'. ఇక రెండో చిత్రం 'మగధీర'తోనే రాజమౌళితో కలిసి ఇండస్ట్రీ లెక్కలను మార్చాడు. ఇక ఈయన ఇప్పటి వరకు 11 చిత్రాలలో నటించాడు. 'చిరుత, మగధీర, ఆరెంజ్, రచ్చ, నాయక్, తుఫాన్, ఎవడు, గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్‌లీ, ధృవ, రంగస్థలం'. కాగా ఆయన నటునిగా మారి 11 పూర్తయ్యాయి. 12వ ఏట 12వ చిత్రంగా బోయపాటి శ్రీను చిత్రం రానుంది.
ఇక తన కెరీర్‌లో ఆయనకు మంచి పేరును తెచ్చిన చిత్రాలు 'మగధీర, ధృవ, రంగస్థలం'. ఇక ఇండస్ట్రీ రికార్డుల పరంగా 'మగధీర, రంగస్థలం' చరిత్రను తిరగరాశాయి. 'చిరుత, నాయక్, రచ్చ, ఎవడు' వంటి చిత్రాలు హిట్ కాగా 'ఆరెంజ్, తుఫాన్, గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్‌లీ' చిత్రాలు సరిగా ఆడలేదు. ఇక తాను నటునిగా మారి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ, ఇప్పటికే 11ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నాను. నిన్ననే నటన ప్రారంభించాననే భావనలో ఉన్నాను. నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. నా ప్రయాణంలో భాగస్వాములైన దర్శక నిర్మాతలందరికీ కృతజ్ఞతలు.. అని చెబుతూ, 'చిరుత నుంచి రంగస్థలం' వరకు తాను నటించిన చిత్రాల పోస్టర్లను పోస్ట్ చేశాడు.
ఇక రామ్‌చరణ్ 12వ చిత్రం బోయపాటి శ్రీను-దానయ్యలతో రూపొందుతోంది. దీనికి 'స్టేట్‌రౌడీ' అనే టైటిల్ పెట్టారని వార్తలు వస్తున్నాయి. విజయ దశమి రోజున ఫస్ట్‌లుక్, టైటిల్‌ను, వచ్చే సంక్రాంతికి సినిమాని విడుదల చేయనున్నారు.