'అజ్ఞాతవాసి' దారుణ పరాజయాన్ని మూటగట్టుకుని రచయితగా, దర్శకునిగా త్రివిక్రమ్‌పై తీవ్ర విమర్శలకు కారణమైంది. అయినా కూడా ఆయనంటే స్టార్ హీరోలకు ఉన్న గురి మాత్రం పోలేదు. బహుశా అది త్రివిక్రమ్‌కే సాధ్యమేమో...? 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ అయినా కూడా ఎన్టీఆర్ ముందుగా అనుకున్న ప్రకారం త్రివిక్రమ్‌తోనే 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల కానుంది. మరోవైపు మాటల మాంత్రికుడు చేయబోయే తదుపరి చిత్రం విక్టరీ వెంకటేష్‌తోనే అని వార్తలు వచ్చాయి. గతంలో వెంకీకి బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన 'నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి' వంటి చిత్రాలకు రచయతగా పనిచేసిన త్రివిక్రమ్ వెంకీని డైరెక్ట్ చేయనుండటం ఇదే మొదటిసారి.
కానీ ప్రస్తుతం వెంకటేష్ 'గురు' తర్వాత ఎంతో గ్యాప్ తీసుకుని ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. 'పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్' చిత్రాలతో తొలి మూడు చిత్రాలతోనే హ్యాట్రిక్ హిట్స్‌ని సాధించి, నేటితరం యంగ్ డైరెక్టర్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ని బాగా పండించగలిగే దర్శకునిగా పేరు తెచ్చుకున్న అనిల్‌రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు బేనర్‌లో మెగా హీరో వరుణ్‌తేజ్‌తో కలిసి వెంకీ మల్టీస్టారర్‌గా 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫస్ట్రేషన్)చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత ఆయన 'జైలవకుశ'తో మంచి హిట్ కొట్టిన బాబీ దర్శకత్వంలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి మరో మల్టీస్టారర్ చేయనున్నాడు. 'వెంకీమామా' అనే టైటిల్‌తో ఇది రూపొందనుంది. ఈ రెండు చిత్రాలను వెంకీ పూర్తి చేసుకునే సరికి కాస్త సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్‌తో బన్నీ ఓ చిత్రం చేయాలని ఇంత కాలం 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' తర్వాత ఖాళీగా వెయిట్ చేస్తున్నాడని సమాచారం.
సో... బన్నీతో, త్రివిక్రమ్ చేసే సినిమా తర్వాతే త్రివిక్రమ్-వెంకీల చిత్రం ఉండనుందని తెలుస్తోంది. కాగా మరో విశేషం ఏమిటంటే. ప్రస్తుతం వెంకీ వరుణ్‌తేజ్, నాగచైతన్యలతో కలిసి నటిస్తున్నాడు. త్రివిక్రమ్ చిత్రం కూడా ఇదే తరహా మల్టీస్టారర్ అని తెలుస్తోంది. సో.. వెంకీ చేయనున్న మూడు చిత్రాలు ఒకే తరహా యంగ్ హీరోలతో కలిసి చేసేవే కావడం విశేషం.