హిందీ అనేది ఎవరు కాదన్నా అవునన్నా జాతీయ భాష. కాబట్టే బాలీవుడ్ చిత్రాలను జాతీయ చిత్రాలుగా, మిగిలిన భాషా చిత్రాలను ప్రాంతీయభాషా చిత్రాలుగా అభివర్ణిస్తూ ఉంటారు. అయితే గతంలో ఎన్నో బాలీవుడ్ చిత్రాలు తెలుగుతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో అనువాదం అయ్యేవి. వాటిల్లో ‘ఖుదాగవా నుంచి మైనే ప్యార్‌కియా’ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే బాలీవుడ్ చిత్రాలు అటు హిందీలో స్ట్రెయిట్‌గా విడుదల కావడం, మరోవైపు అనువాదం కూడా అయితే అలాంటి చిత్రాల మీద ఇష్టం ఉన్న వారు కేవలం స్ట్రెయిట్ చిత్రాన్ని మాత్రమే థియేటర్లలో చూడాలని భావిస్తారు. అందుకే ‘ప్రేమపావురాలు’తో పాటు ఒకటి అరా చిత్రాలు మినహా మిగిలిన అనువాద చిత్రాలు మన దగ్గర ఆడలేదు.
ఇక విషయానికి వస్తే దక్షిణాది చిత్రాలలో మరీ ముఖ్యంగా రజనీకాంత్ నటించిన చిత్రాలు బాలీవుడ్‌లో కూడా విడుదలవుతూ మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి. ఈ విషయంలో ‘బాహుబలి’ మరో అడుగు ముందుకేసింది. గతంలో ఏ హిందీ డబ్బింగ్ చిత్రం సాధించని విజయాన్ని నమోదు చేసి బాలీవుడ్‌నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో బాలీవుడ్ వారు కూడా నిద్రలేని రాత్రులు గడిపారు. దీనిపై సల్మాన్‌ఖాన్ అయితే బహిరంగంగానే తన అక్కసు వెళ్లగక్కాడు. హిందీ సినీ ప్రేక్షకులు ఎంతో ఉదారహృదయులని కాబట్టే ప్రాంతీయ భాషా చిత్రాలైన ‘రోబో, బాహుబలి’ వంటి వాటిని ఆదరించారని, కానీ ప్రాంతీయ భాషలు, మరీ ముఖ్యంగా దక్షిణాది ప్రేక్షకులు మాత్రం తమ హీరోల చిత్రాలను మాత్రమే చూస్తారని కొత్త భాష్యం చెప్పాడు.
ఇక రాబోయే ‘2.ఓ’ చిత్రం కూడా బాలీవుడ్‌లో మరో సంచలనాన్ని నమోదు చేయడానికి రెడీ అవుతోంది. ఇక దీంతో బాలీవుడ్ వారు కూడా తమ చిత్రాలను తెలుగు, తమిళ భాషల్లోకి కూడా ఒకేసారి అనువాదం చేసి వీలైనంత సంపాదించాలని ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా అమితాబ్‌బచ్చన్, అమీర్‌ఖాన్‌లు నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రాన్ని బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా దీపావళి కానుకగా నవంబర్ 8న విడుదల చేయనున్నారు. తెలుగు ట్రైలర్‌ని ఏకంగా రాజమౌళి చేత సోషల్‌మీడియాలో విడుదల చేశారు.
‘ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చింది వ్యాపారం కోసమే. కానీ ఇప్పుడు అది అధికారం చెలాయిస్తోంది. కానీ బానిసత్వానికి తలొగ్గని వారు కొందరున్నారు’ అనే వాయిస్ ఓవర్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఆంగ్లేయులకు, థగ్స్‌కి జరిగిన పోరాటాన్ని ఇందులో కట్ చేశారు. పాత్రలతో పాటు సినిమాలోని భారీతనాన్ని కూడా ఈట్రైలర్ పరిచయం చేస్తోంది. అద్భుతమైన ఫొటోగ్రఫీ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లేలా ఉంది. అందుకే అమితాబ్, అమీర్‌లు అద్భుతమైన ట్రీట్ ఇచ్చారని రాజమౌళి ప్రశంసించాడు.
ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తూ టీంకి అభనందనలు తెలిపాడు. మరి ఈ చిత్రమైనా అనువాదం రూపంలో మనల్ని ఆకట్టుకుంటుందా? లేదా? అనేది చూడాలి. ఇక ట్రైలర్‌లో తెలుగులో మాట్లాడిన అమీర్, అమితాబ్‌లు సినిమాలో కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారా? లేదా? అనేది చూడాలి. ఇప్పటివరకు హాలీవుడ్ అనువాదాలను మాత్రమే ఆదరించిన మన వారు ఈ సినిమాని ఎలా ఆదరిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.