నేడు మీడియా అనేది వింతపొకడలు పోతోంది. ఇందులో మీడియా తప్పే కాదు.. యాజమాన్యాలు, ఆర్థికబలం ఉన్న పెట్టుబడిదారుల చేతుల్లో మీడియా బంధీ కావడం, పార్టీకే మీడియా పుట్టుకొస్తూ ఒకే విషయాన్ని ఎవరు ఎవరికి తగ్గట్టుగా తమకు తాము భాష్యం చెప్పుకుంటున్నారు. చివరకు కోర్టుల తీర్పులను కూడా తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఇదే సమయంలో మీడియాలో బ్రేకింగ్ న్యూస్‌లు, సెన్సేషనల్ వార్తలను క్యాష్ చేసుకుని టీఆర్పీలు, సర్క్యులేషన్స్ పెంచుకునే ధోరణి పెరిగింది. నిజానికి మీడియా వారే కాదు.. పలు వివాదాలపై మీడియా ముందుకు వచ్చి తమకిష్టమైన వ్యాఖ్యలు చేస్తున్న వారు కూడా ఏదో విధంగా ఆ వార్తకి మరింత ప్రచారం తేవాలని, తాము ఉచిత పబ్లిసిటీ పొందాలని తాపత్రయ పడుతున్నవారే. అందుకే నిజమైన మేధావులు, విశ్లేషకులు మీడియాలో చర్చలకు కూడా రాకపోవడం మనం బాగా గమనించవచ్చు. దీక్షితులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారిని ఆహ్వానించే వారు, ఆహ్వానించినా రావడానికి సుముఖత చూపని వారు ఎందరో ఉన్నారు.
ఇదే విషయంలో నానా పాటేకర్ తన పరిణతిని చూపాడు. తనుశ్రీ దత్తా లాగా తాను కూడా మీడియా ముందుకు వస్తే తాను మాట్లాడేది ఒకటైతే, వాటిని మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరుగుతాయని, కాబట్టి తాను కూడా ఈ విషయాన్ని మీడియా ముందు మాట్లాడితే తనుశ్రీ దత్తాకు తనకు తేడా ఉండదని భావించాడు. 'వీరభద్ర' ఫేమ్ తనుశ్రీ దత్తా గతంలో తన పట్ల నానా పాటేకర్ అసభ్యంగా ప్రవర్తించాడని, నానా యాగీ చేస్తోంది. దీనిపై నానా పాటేకర్ హుందాగా స్పందించాడు. ఆ అమ్మాయి నాపై లేని పోని ఆరోపణలు చేస్తూ ఉంటే ఇక నన్నేం చేయమంటారు? సినిమా చిత్రీకరణ సమయంలో నాతో పాటు వంద మంది యూనిట్ వారు ఉన్నారు. ఈ విషయం గురించి నేను ఎంత మాట్లాడినా వృథానే..! నాపై ఆమె చేసిన ఆరోపణలకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాత్రమే భావిస్తున్నాను. నేనేం మాట్లాడినా మీ మీడియా వర్గాలు ఏవేవో రాసేస్తాయి అంటూ తన ఆవేదనను తెలిపాడు.
ఆ చిత్రానికి కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన గణేష్ ఆచార్య కూడా తనుశ్రీ ఆరోపణలను ఖండించాడు. ఆ సెట్‌లో తాను కూడా ఉన్నానని, నానా ఇచ్చిన సూచనలను ఆమె తప్పుగా అర్ధం చేసుకుందని తెలిపాడు. ఈ విషయంలో నానా పాటేకర్ మీడియా విషయంలో చూపిన విజ్ఞత అందరికీ ఆదర్శం కావాలి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అది మీడియాకు కాసులు తెచ్చే పని అవుతుందే తప్ప దీని వల్ల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదనే నానా ఆవేదన అర్దం చేసుకోవాల్సిందే.