టాలీవుడ్‌కి సమ్మర్, సంక్రాంతి తర్వాత అతి పెద్ద సీజన్ విజయ దశమి. విద్యార్దులకు వరుసగా సెలవులు ఇచ్చే ఈ పండగను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఎందరో పెద్ద చిత్రాల వారు ఆశిస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది దసరాకు ఎన్నో చిత్రాలు విడుదల కానున్నప్పటికీ అందరి దృష్టి మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ'పైనే ఉంది. తన కెరీర్‌లో ఎన్నడు ఎదుర్కోని విమర్శలను ఎదుర్కొని 'అజ్ఞాతవాసి' ద్వారా అందరినీ తీవ్రంగా నిరాశపరచిన త్రివిక్రమ్ ఈ చిత్రం ద్వారా జరిగింది కేవలం పొరపాటు మాత్రమేనని, తన సత్తా మాత్రం తగ్గలేదని ఈ చిత్రం ద్వారా నిరూపించుకోవాలనే కసితో ఉన్నాడు. ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ జత కట్టడం ఇదే మొదటి సారి కావడంతో అందరిలో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. 'అజ్ఞాతవాసి' ద్వారా త్రివిక్రమ్‌నే నమ్ముకున్న హారిక అండ్ హాసిని సంస్థ, దాని అధినేత రాధాకృష్ణ అలియస్ చినబాబు 'అరవింద సమేత'తో తన బేనర్ స్థాయిని, 'అజ్ఞాతవాసి' నష్టాలను పూడ్చుకోవాలని ఉన్నాడు.
మరోవైపు 'టెంపర్' నుంచి వరస విజయాల మీద ఉన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ది డైలాగ్స్ చెప్పడంలో నేటితరం స్టార్స్‌లో అందెవేసిన చేయి. మరి త్రివిక్రమ్ మాటల మాయాజాలం ఎన్టీఆర్ నోటి వెంట వస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచనలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇప్పటి వరకు పవన్, అల్లుఅర్జున్, మహేష్‌బాబు వంటి వారితోనే ఎక్కువ పనిచేసిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ అభిమానులను ఏ స్థాయిలో రంజింపజేస్తాడో అనేది మరో ఆసక్తికర అంశం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మూడు లిరికల్ సాంగ్స్‌తో ఇందులోని పాటలు కథానుసారం అద్భుతంగా ఉన్నాయనే ఫీలింగ్స్‌ని కలిగించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాయి.
ఇక ఈ చిత్రం కౌంట్‌డౌన్ త్వరలో ప్రకటించే ప్రీరిలీజ్ ఈవెంట్‌తో మొదలుకానుంది. ఇందులో ఓ ఎలక్షన్ల ఎపిసోడ్ కూడా ఉంటుందని, ఇది ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించే స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ గత చిత్రం 'జైలవకుశ'లో కూడా ఎలక్షన్ల సీన్స్ బాగా రంజింపజేసిన విషయం తెలిసిందే. యాక్షన్, ఎమోషన్స్‌కి పెద్ద పీట వేస్తూ, ఎన్టీఆర్‌కి సంబంధించిన స్థానిక ఎన్నికల సీన్ ఇందులో అద్భుతంగా ఉంటుందిట. ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తూ, రాయలసీమ యాసలో మాట్లాడనుండటం ఈ చిత్రానికి మరో ప్రత్యేకత కాగా, పూజాహెగ్డే అందాలు, ఈషారెబ్బ క్యారెక్టర్ కూడా దీనికి హైలైట్‌గా చెబుతున్నారు.