పవన్ సిద్దాంతాలను నమ్మిన వ్యక్తి అని పలువురు నమ్ముతారు. తనకి యుక్త వయసు వస్తున్న సమయంలోనే ఆయన తుపాకి చేత బట్టి విప్లవపంధాలోకి వెళ్లాలని భావించానని, అది చూసి తన అన్నయ్య, వదిన భయపడ్డారని చాలా సార్లు తెలిపాడు. ఆయన నమ్మే చేగువేరా, గుంటూరు శేషేంద్రశర్మ వంటి వారు కూడా అలాంటి భావజాలం ఉండేవారే. ఆవేశం అణుచుకోలేని పవన్ నైజం కొందరికి నచ్చవచ్చు. మరికొందరికి నచ్చకపోవచ్చు. కానీ నేడు అధికారంలో ఉన్నవారు, బలవంతులైన వారు చేస్తున్న అక్రమాలు, అవినీతి, లైంగికవేధింపులు చూస్తుంటే వారికి మద్దతుఇస్తున్నవారు కూడా అదే తప్పులో భాగస్వాములవుతున్నారనే భావించాలి. దీనినే విప్లవపరిభాషలో చెప్పాలంటే రాజ్యహింసగా చెప్పాలి. అక్రమాలు, అన్యాయాలు, పసిమొగ్గలపై కూడా అత్యాచారాలు చేస్తున్న వారికి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులే అండగా నిలుస్తుంటే ఇక ఏ పోలీసు గానీ, అధికారి అయినా తన బాధ్యతలను ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిడులు లేకుండా నెరవేర్చగలడా? అనేది అందరు ఆలోచించాల్సిన విషయం.
నేడు ఏ పార్టీలో చూసినా ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలవగలడా? లేదా? అనేది మూలం అయిపోయింది. అలా ఒక ఎమ్మెల్యే సీటుకే ఏకంగా 50కోట్లు ఖర్చుపెడుతున్న వారు అధికారంలోకి వస్తే ఏమి చేస్తారు? వచ్చే ఎన్నికల్లో మరలా గెలవడానికి ఎంత సంపాదించుకోవాలనే దానిపైనే దృష్టి పెడుతున్నారు. అలాగని నక్సల్స్ తరహాలో హింసకి ప్రతి హింస సమాధానం కారాదు. ప్రజాస్వామ్యంలో ఆయుధం అనేది ప్రజలు వేసే ఓట్లు, వారు చేసే ఉద్యమాలే కావాలి గానీ చంపడం మాత్రం కాదు. ఇక దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలో పవన్ చెప్పింది అక్షరసత్యం. ఒక చింతమనేని ప్రభాకరే కాదు.. నేటి రాజకీయ ప్రజా ప్రతినిధుల్లో 90 శాతం ఇలాంటి వారే. జ్యోతిబసు, సోమనాథ్ చటర్జీ, మాణిక్ సర్కార్, వాజ్‌పేయ్ వంటి వారు కూడా నేటి ఎన్నికల్లో గెలవలేరు. ఒకసారి అధికారంలోకి వచ్చినా రెండో సారి కష్టమే.
ఇక విషయానికి వస్తే నేడు టిడిపి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న విషయం ‘మళ్లీ మీరే రావాలి.. కావాలి’ అనే నినాదం. నేడు చంద్రబాబు పర్యటన సందర్భంగా టిడిపి సామాజిక వర్గం బలంగా ఉండే యూఎస్ నుంచి అన్ని దేశాలలోనూ ఇవే హోర్డింగ్స్ వెలుస్తున్నాయి. దీనిపై పవన్‌కళ్యాణ్ ఘాటుగా స్పందించాడు. ఎక్కడికి వెళ్లినా మళ్లీ మళ్లీ మీరే రావాలి అనే హోర్డింగ్స్ చూస్తున్నాను. ఎందుకు రావాలి? ఇలాంటి ఆకురౌడీలను ప్రజల మద్యకు వదలడానికా? అంటూ చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశాడు. అయితే ఇదే వ్యాఖ్యలు జగన్‌కి, పవన్‌కి కూడా వర్తిస్తాయి అనేది వాస్తవం. భావోద్వేగాలను అణుచుకోలేని పవన్ ఒకానొక సందర్భంలో నక్సల్స్ చర్యలను కూడా వెనకేసుకొచ్చాడు. ఎక్కువ దారుణాలు చేస్తే నక్సలైట్లు చంపక ఏం చేస్తారు? ప్రజల మీద రౌడీయిజం చేస్తూ ఉంటే నక్సల్స్ ఇలా చంపుతూనే ఉంటారు. ఆకురౌడీలను, గాలి రౌడీలను 16ఏళ్ల వయసులోనే తన్ని తరిమేసిన వాడిని. నేను ఒక సైగ చేస్తే, ఇంకా మీసాలుకూడా రాని జనసైనికుడు ఇలాంటి గాలి రౌడీల కాళ్లు, కీళ్లు విరగొట్టి కింద కూర్చోబెడతారు జాగ్రత్త. ఖబడ్దార్.. గూండాయిజం, రౌడీయిజం చేసి రాజకీయం చేద్దామనుకుంటే కాళ్లు విరగొడతాం. ఆంధ్రప్రదేశ్ ఎవరి జాగీరు కాదు. 27కేసులున్న వ్యక్తిని ప్రభుత్వ చీఫ్‌గా ఎలా పెడతారు?
చింతమనేని అంటే సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కి భయం. మీరు చర్యలు తీసుకుంటారా? మమ్మల్ని తీసుకోమంటారా? నిర్ణయించుకోండి డీజీపి అని డిజిపిని ఉద్దేశించి ప్రశ్నించారు. నేను తలుచుకుంటే అగ్నిగుండం సృష్టించగలను. చిన్నపాటి వెంట్రుక వంటి ఎమ్మెల్యే ఎంత? ఆడపడుచుల మీద చెయ్యి వేస్తే తలతీస్తానని చెప్పండి. ప్రతి దానికి ప్రతిచర్య ఉంటుంది. శాంతిని నెలకొల్పాలంటే కత్తి అండ కావాల్సిందే. ఆకత్తి పట్టిన సైనికుణ్ని నేనవుతా.. అంటూ ఆవేశంగా మాట్లాడాడు. ఆ వెంటనే కాస్త తట్టుకుని నక్సలైట్లు చేస్తున్న పనిని నేను సమర్దించడం లేదు. మీ దోపిడీలు తప్పని చెబుతున్నా అని తెలిపాడు. ఆయితే పవన్ చెప్పిన మాటలు ఆయనకు కూడా వర్తిస్తాయనేది తెలుసుకుంటే పవన్ మంచి నాయకుడవుతాడు.. లేదంటే అందరిలాంటి నాయకుడే అవుతాడు.