‘మహానటి’ చిత్రంలో పలువురు తెరవెనక ఉన్న వారు కూడా కొన్ని నాటి కీలకమైన వ్యక్తుల పాత్రలను పోషించి మెప్పించారు. ప్రస్తుతం క్రిష్ కూడా ఎన్టీఆర్ బయోపిక్‌లోని కొన్ని పాత్రలకు కొత్త వారిని, పెద్దగా పేరు లేని వారిని ఎంచుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇప్పటికే పురందేశ్వరిగా పెద్దగా గుర్తింపులేని ఆర్టిస్టుని చూపించనున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో కీలక పాత్రను సైతం ఓ దర్శకుడు పోషిస్తున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, చంద్రబాబునాయుడుగా దగ్గుబాటి రానా, ఏయన్నార్‌గా సుమంత్, ఎస్వీఆర్‌గా నాగబాబు, హరికృష్ణగా కళ్యాణ్‌రామ్, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌సింగ్ ఇలా ఎంచుకుని ముందుకు పోతున్న ఆయన ఎన్టీఆర్‌తో పలు జానపద చిత్రాలను తెరకెక్కించిన విఠలాచార్య పాత్రకి కోసం ఓ దర్శకుడిని ఎంచుకున్నాడు. ‘ఎన్‌కౌంటర్’ చిత్రంతో దర్శకునిగా పరిచయం అయి, ‘శ్రీరాములయ్య’తో పాటు ఆయన తీసిన అన్ని చిత్రాలను సామాజిక స్పృహతోనే తీసిన ఎన్.శంకర్‌ని నిజంగా తమిళ శంకర్ అంత ప్రతిభ ఉంది. సరైన బడ్జెట్ చిత్రం వస్తే ఈ శంకర్ కూడా ఆ శంకర్‌తో పోటీ పడేవాడే. కానీ ఇటీవల వచ్చిన ‘టూస్టేట్స్’ మాత్రం ఆయన శైలిలో లేకుండా పోయింది. ఎన్టీఆర్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉన్న విఠలాచార్యపాత్ర కోసం క్రిష్ దర్శకుడు ఎన్.శంకర్‌ని ఎంచుకున్నాడట. గతంలో కూడా కొన్ని చిత్రాలలో శంకర్ నటునిగా కూడా తళుక్కున మెరిశాడు. ఎన్టీఆర్, విఠలాచార్యకి సంబంధించిన సీన్స్ కూడా ఈ చిత్రంలో కీలకభూమికను పోషించనున్నాయి. ఆల్‌రెడీ ఎన్.శంకర్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడని కూడా తెలుస్తోంది.
సంక్రాంతికి విడుదల చేసేందుకు షూటింగ్‌ను శరవేగంతో జరుపుతున్నారు. కీరవాణి అందించనున్న సంగీతం కూడా సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలవనుంది. మరి ప్రస్తుతం కత్తి కాంతారావు బయోపిక్ కూడా రూపొందుతోంది. ఎన్టీఆర్ కంటే కాంతారావు కెరీర్‌లో విఠలాచార్యది మరింత కీలకమైన పాత్ర. మరి అందులో విఠలాచార్యగా ఎవరు నటిస్తారో వేచిచూడాల్సివుంది..!