మహానటి సినిమాలో సావిత్రి నట జీవితంలో కీలక వ్యక్తులైన ఏఎన్నార్, ఎన్టీఆర్ లలో ఎన్టీఆర్ పాత్రను గ్రాఫిక్స్ కే పరిమితం చేసిన దర్శకుడు... ఏఎన్నార్ పాత్రను నాగ చైతన్యతో వేయించాడు. అయితే ఏఎన్నార్ పాత్రలో నాగ చైతన్య నాలుగైదు సీన్స్ లో కనిపించాడు. అయితే సావిత్రి జీవిత కథలో చాలామంది ప్రముఖులను నాగ్ అశ్విన్ చిన్న చిన్న గెస్ట్ రోల్స్ కే పరిమితం చేశాడు. ఎందుకంటే ఆయా పాత్రలను కూలంకషంగా చూపిస్తే... బయోపిక్స్ ని రెండు భాగాలుగా తీసినా సరిపోదు కాబట్టి. తాజాగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా చాలామంది ప్రముఖులు భాగమవుతున్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఏఎన్నార్ పాత్రలో ఆయన కూతురు కొడుకు సుమంత్ చేస్తున్నాడు.
తాజాగా విడుదలై ఏఎన్నార్ లుక్ లో సుమంత్ తాత గారి ఫోజుని యాజిటీజ్ గా దింపెయ్యడం, ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రల పరిచయం, వారి మధ్యన ఉన్న అనుబంధాన్ని పోస్టర్ రూపంలో వదిలారు. ఇక ఆ పోస్టర్స్ చూసిన వారంతా ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ ప్రముఖ పాత్ర పోషిస్తుందనుకున్నారు. ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ వుండేది. ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఈ కారణంగానే ఈ ఇద్దరూ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ లో నాగేశ్వర రావు గారు సీన్స్ ఎక్కువ ఉంటాయని అక్కినేని అభిమానులు ఆశపడ్డారు.
కానీ తాజాగా ఫిలింనగర్ టాక్ ఏమిటంటే... ఈ సినిమాలో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కాంబినేషన్లో 3 నుండి 4 సీన్లు మాత్రమే వుండనున్నాయనేది... రాజకీయాలలోకి రావడానికి ముందు ఏఎన్నార్ తో ఎన్టీఆర్ జరిపిన ఆసక్తికరమైన చర్చ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి నాగేశ్వర రావు లుక్ లో సుమంత్ ని తీర్చి దిద్దిన విధానం, సుమంత్ ఏఎన్నార్ లుక్ లో అదరగొట్టేసరికి అక్కినేని అభిమానులు ఎక్కువ ఊహించుకున్నారు. కానీ తాజా సమాచారంతో అక్కినేని అభిమానులు ఢీలా పడినట్లుగా తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ - ఏఎన్నార్ సీన్స్ ఎక్కువ పెడితే ఎన్టీఆర్ పొలిటికల్ జీవితాన్ని తగ్గించాల్సి వస్తుందనే క్రిష్ ఇలా ఎన్టీఆర్ తో అనుబంధం ఉన్న ప్రముఖులను గెస్ట్ పాత్రలకే పరిమితం చేయబోతున్నాడట.