ఆనంద్.. ఈ పేరు దక్షిణాది ప్రేక్షకులకు బాగా సుపరిచితం. ఈయన తెలుగువాడయినప్పటికీ తెలుగులో కంటే తమిళం, మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు కన్నడ చిత్రాలలో కూడా నటించాడు. తెలుగులో ఈయన నటించిన చిత్రాలు పెద్దగా ఆడలేదు. కానీ ఈయన మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘తిరుడా తిరుడా’ (తెలుగులో దొంగా..దొంగా) చిత్రంలో ప్రశాంత్‌తో కలిసి హీరోగా నటించాడు. ఆ తర్వాత కూడా కమల్‌హాసన్‌తో కలిసి ‘సత్య’తో పాటు పలువురు స్టార్స్ చిత్రాలలో నటిచాడు. ‘దొంగా దొంగా’ విడుదలైనప్పుడు ఈయన స్టార్ హీరో కావడం ఖాయమని పలువురు భావించారు. నిజానికి ఈయన, విక్రమ్‌లు అటు ఇటుగా ఒకేసారి వెలుగులోకి వచ్చారు. కానీ తనకు వచ్చిన అవకాశాలను ఎంచుకోవడంలో ఈయన విఫలయ్యాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాడు. ఇటీవల నాని ‘జెంటిల్‌మేన్’, మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’తో పాటు పలు చిత్రాలలో నటిస్తున్నాడు.
ఇక ఈయన దక్షిణాదిలోని అన్ని భాషల్లో టివి ఆర్టిస్టుగా కూడా పేరు సంపాదించాడు. ఈయన సోదరుడు భరత్ అరుణ్ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్‌కోచ్. ఈయన నటించిన ‘నిప్పులాంటి నిజం’ అనే సీరియల్ డబ్బింగ్‌గా 2000 సంవత్సరంలోనే ఈటీవీలో ప్రసారమైంది. ప్రస్తుతం ఆయన తెలుగులో డైరెక్ట్ సీరియల్‌గా నిర్మితమవుతున్న ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అనే సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈయన తాజాగా మాట్లాడుతూ, ఓ ఆసక్తికర సంఘటనను చెప్పుకొచ్చాడు.
‘‘తమిళంలో దివ్యభారతి తొలిసారిగా నాతోనే నటించింది. ఆ సినిమా షూటింగ్ 60రోజుల పాటు దట్టమైన అడవిలో జరిగింది. ఆ అడవిలోకి పోవడానికి సినిమా వారే రోడ్డు వేశారు. అడవికి సమీపంలోని నదిలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. పాట కోసమని చెప్పి సొంతంగా ఓ పడవను కూడా తయారు చేయించారు. పడవలో నదిలోకి పంపేటప్పుడు ‘ఈత వచ్చా’ అని యూనిట్ వారు అడిగారు. ‘తెలుసు’ అని అబద్దం చెప్పాను. దురదృష్టం కొద్ది పడవ నదిలో కొంత దూరం వెళ్లగానే మునిగిపోయింది. నాకు ఈత వచ్చని అనుకున్న దివ్యభారతి చకచకా ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్తోంది. నేను మునిగిపోతుండటం చూసి యూనిట్ వారు గట్టిగా అరిచారు. వాళ్లతో పాటు దివ్యభారతి ఈదుకుంటూ నా వద్దకు వచ్చి నన్ను ఒడ్డుకి చేర్చి ప్రాణాలు కాపాడింది..’’ అని చెప్పుకొచ్చాడు.