తెలుగుసినీ చరిత్రలో నిన్నటితరం దర్శకుల్లో సామాజిక బాధ్యతతో చిత్రాలు తీసిన వారిలో టి.కృష్ణ, దాసరి, ముత్యాలసుబ్బయ్య, కోడిరామకృష్ణల సరసన చేర్చాల్సిన వ్యక్తి మోహనగాంధీ. ఈయనలోని అద్భుతమైన భావాలను ఎంత చెప్పినా తక్కువే. కానీ మిగిలిన వారికి వచ్చినంత గుర్తింపు, పేరు మోహనగాంధీకి లభించలేదనేది వాస్తవం. ఆయన తీసిన ‘మౌనపోరాటం, కర్తవ్యం, పీపుల్స్ ఎన్‌కౌంటర్, ఆశయం’ వంటి చిత్రాలెన్నో ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి. పెద్దగా హంగులు ఆర్బాటాలు లేకుండా కథనే నమ్ముకుని ఆయన తీసిన చిత్రాలన్ని ఆణిముత్యాలే.
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ మోహనగాంధీ గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. నేటి తరానికి గుర్తుచేసినందుకు పరుచూరికి కూడా వందనాలు చెప్పాలి. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో చేసిన ‘అనురాగదేవత’ తర్వాత మాకు అన్ని పెద్ద చిత్రాలకు రాసే అవకాశాలే వచ్చాయి. ఆ సమయంలో మోహనగాంధీ గారు మా దగ్గరికి వచ్చారు. ‘నా దగ్గర ఓ కథ ఉందండి.. చాలా తక్కువ డబ్బులు మాత్రమే ఇప్పించగలుగుతాను. కాస్తసంభాషణలు రాస్తారా?’ అని అడిగారు. ‘కథ నచ్చితే రాస్తామని చెప్పాం. ఆయన చెప్పిన కథ మాకు ఎంతో బాగా నచ్చింది. ఆ సినిమాకి మేము మాటలు రాస్తున్నామని తెలిసి రాఘవేంద్రరావు గారు ఆ సినిమాకి మాటలు రాస్తే మిమ్మల్ని మరలా ఉయ్యూరు పంపించేస్తాను అన్నారు. ఆ చిత్రం అంత చిన్న సినిమా అని చెప్పడం కోసం ఈ మాటను చెప్పాను.
ఆ సినిమా ‘టెర్రర్’ విడుదలైన తర్వాత సంచలనం సృష్టించింది. తెలుగులో శతదినోత్సవం చేసుకుంది. కన్నడలో ప్రభాకర్ హీరోగా చేయగా అక్కడ కూడా 100రోజులు ఆడింది. చిన్నబడ్జెట్.. పెద్ద బడ్జెట్ అని కాదు. కథలో దమ్ము ఉండాలి. అది ప్రేక్షకులలోకి వెళ్లాలని ఈ చిత్రం నిరూపించింది.. అని చెప్పుకొచ్చారు.