స్టాక్ మార్కెట్స్.. దీనిని కూడా ఓ జూదం అనవచ్చు. కానీ నేటి దేశాలన్నీ దేశాభివృద్దికి వీటినే కొలమానంగా తీసుకుంటున్నాయి. ఇందులో తెలివిగా పెట్టుబడి పెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన బఫెట్ వంటి వారు ఎందరో ఉన్నారు. కానీ ఈ సెన్సెక్స్, నిఫ్టీల గోల సామాన్యులకి అర్దం కాదు. కానీ నిజమైన పెట్టుబడిని తెలివిగా ఇందులో పెడితే రాత్రికి రాత్రి కుబేరులై పోయిన వారు కూడా ఎందరో ఉన్నారు. అప్పుడప్పుడు హర్షద్‌మెహతా వంటి వారు వస్తూ దీనిని తప్పుడు వ్యాపారంగా మార్చివేయడం బాధాకరం. అయితే జీవితంలో సక్సెస్ కావాలంటే రిస్క్ తీసుకోకతప్పదు. అది కూడా కాలిక్యూలేటెడ్ రిస్క్. ఈ విషయంలో యువతకు మంచి స్ఫూర్తినిచ్చే చిత్రంగా త్వరలో మన ముందుకు ఓ మూవీ రానుంది. అదే ‘బజార్’.
సైఫ్‌అలీఖాన్ ఇందులో ప్రధానపాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. నిజంగా ఈ ట్రైలర్‌ని బాగా క్షుణ్ణంగా అర్దం చేసుకుంటే మాత్రం ఇది యువతకు మంచి స్ఫూర్తినిచ్చే చిత్రంగా ఉండనుందనే విషయం ఖచ్చితంగా అర్ధమవుతుంది. ‘జీవితంలో గొప్పవాడిగా ఎదగాలంటే రిస్క్ తీసుకోకతప్పదు’ అనేదే ఈ చిత్రం కాన్సెప్ట్. ఇందులో షకున్ కొఠారి అనే పెద్ద పారిశ్రామికవేత్త పాత్రలో సైఫ్ కనిపిస్తున్నాడు. ట్రైలర్‌లో ఓ వ్యక్తి వ్యాపారం గురించి సైఫ్‌తో మాట్లాడుతూ.. ‘జీవితం మారధాన్ వంటిది. 100మీటర్ల స్ప్రింట్ వంటిది కాదు’ అంటాడు. అందుకు సైఫ్ ‘ప్రపంచంలో గొప్ప మారథాన్ రన్నర్ ఎవరో చెప్పు’ అంటాడు. అందుకు సదరు వ్యక్తి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతాడు. అప్పుడు సైఫ్ మరో ప్రశ్న వేస్తూ, 100మీటర్లను వేగంగా పరుగెత్తే వ్యక్తి పేరు చెప్పు అంటాడు. ‘ఉసేయిన్ బోల్ట్’ అని ఆ వ్యక్తి సమాధానం ఇస్తాదు. ‘చూశావా.. పరుగెత్తుతూనే ఉండేవారిని లోకం గుర్తుపెట్టుకోదు అంటాడు’. అంటే మారథాన్‌లు పరుగెత్తేవారికంటే 100మిటర్ల స్ప్రింట్‌లో గెలిచే వారినే అందరు గుర్తు పెట్టుకుంటారన్న పాయింట్ ఈ డైలాగ్స్ ద్వారా అద్భుతంగా చెప్పించారు.
‘వ్యాపారంలో డబ్బులను పెట్టుబడిగా పెట్టాలే గానీ భావోద్వేగాలను కాదు..ఎప్పుడు ఈ ప్రపంచాన్ని ఏలేది టాటా బిర్లా, అంబానీలేనా? కొత్తగా ప్రయత్నించి చూద్దాం. ఈసారి కొఠారిస్ వస్తే ఎలా ఉంటుంది?’ అనే డైలాగ్‌ని హైలైట్‌గా చెప్పుకోవచ్చు. అక్టోబర్ 26న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ట్రైలర్‌ని చూసిన వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తారనే చెప్పాలి.