నిన్నటితరం స్టార్ హీరోయిన్లలో రంభకి ప్రత్యేక స్థానం ఉంది. ఈమె అసలు పేరు విజయలక్ష్మి. విజయవాడ వాస్తవ్యురాలైన ఈమెను ఈవీవీ సత్యనారాయణ.. తాను రాజేంద్రప్రసాద్, రావుగోపాలరావు ప్రధాన పాత్రలో తీసిన ‘ఆ..ఒక్కటి అడక్కు’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేశాడు. ఈమెలో నాటి యువత డ్రీమ్‌గర్ల్ దివ్యభారతి ఫీచర్స్ ఎక్కువగా ఉండేవి. దాంతో దివ్యభారతి ఆకస్మిక మరణం తర్వాత పెండింగ్‌లో పడిపోయిన ‘తొలిముద్దు’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలలో ఈమె దివ్యభారతి స్థానంలో డూప్‌గా నటించింది. ఆ తర్వాత ఈమెకి తిరుగేలేకుండా పోయింది. ఏకంగా స్టార్ హీరోలందరి చిత్రాలలో నటించింది. ‘హిట్లర్, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు, గణేష్, భైరవద్వీపం’ వంటి పలు చిత్రాలలో నటించి అల్లరి పిల్లగా, బబ్లీగర్ల్‌గా ఎంతో పేరు తెచ్చుకుంది.
2010లో ఈమె మలేషియాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ని వివాహం చేసుకుని టొరంటోలో స్ధిరపడింది. వీరికి లానా, సాస్య అనే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తర్వాత ఈమెకి భర్తతో విభేదాలు వచ్చాయి. దాంతో విడాకుల కోసం రంభ తన ఇద్దరు పిల్లలతో కలసి తిరిగి ఇండియాకు వచ్చేసింది. ఆతర్వాత విబేధాలను మరిచి వీరు మరలా ఒకటయ్యారు. దీంతో వీరి కథ సుఖాంతం అయింది. తాజాగా రంభ-ఇంద్రకుమార్ జంటకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని ఆమె భర్త ఇంద్రకుమార్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ‘మాకు మగ శిశువు జన్మించాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు’ అని ఆయన సంతోషంగా తెలిపాడు. ఈ సందర్భంగా నెటిజన్లు తమ అభిమాన హీరోయిన్ అయిన రంభకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వివాహం తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మొత్తానికి ఈ జంట మరలా ఒకటై మరో మగబిడ్డకు జన్మనివ్వడం సంతోషదాయకమైన విషయం.