తెలుగులో హిట్‌ని హిట్టు, ఫ్లాప్‌ని ఫ్లాప్ అని ఒప్పుకునే అరుదైన వ్యక్తుల్లో నాగార్జున ముందుంటాడు. అందుకే ఆయనను అందరు జెంటిల్‌మేన్‌గా అభివర్ణిస్తారు. తాను నటించిన 'భాయ్' చిత్రం ఇంకా ఆడుతుండగానే ఆ చిత్రం చూడవద్దని చెప్పిన ఘనత నాగార్జునకే చెందుతుంది. ఇక విషయానికి వస్తే ప్రతి మనిషి జీవితంలో ఎదగడానికి శ్రేయోభిలాషుల మాటలు వినడం అవసరం. ఈ విషయంలో మాతా, పితృలను మించిన శ్రేయోభిలాషులు ఎవ్వరూ ఉండరు. ఈ విషయంలో నేటి యువత పెడదోవ పట్టడానికి, ప్రేమలు, దోమలు అంటూ చెడు మార్గంలో పయనించి వాటినే వ్యక్తిగత స్వేచ్చ అని, రాజ్యాంగం మేజర్ కాగానే తమకి అన్ని విషయాలలో స్వేచ్చనిచ్చిందని వాదించడం తప్పు. ఆ ప్రముఖ వ్యక్తి చెప్పినట్లు ప్రాధమిక హక్కులు ఎలా రాజ్యాంగం కల్పించిందో అదే పక్కా చాప్టర్‌లో ప్రాధామిక బాధ్యతలను కూడా గుర్తు చేసింది. తల్లిదండ్రుల మాట వినవద్దని, పెద్దలను వెన్నుపోటు పొడవమని ఏ రాజ్యాంగం కానీ, మతం గానీ, కులం గానీ చెప్పదు.
ఇక విషయానికి వస్తే నాగార్జున ఎంతో బోల్డ్‌గా చేసిన వ్యాఖ్యలు వాటికి అద్దం పడతాయి. పెద్దలు చెప్పినవన్నీ మంచినే చేస్తాయని చెప్పకపోయినా అలా వారి అనుభవంతో చెప్పిన మాటలు వింటే సక్సెస్ అనేది నేడు రాకపోయినా రేపు ఖచ్చితంగా వస్తుంది. నాగచైతన్య మొదటి చిత్రం 'జోష్' ఫ్లాప్ అయితే తప్పు నాదే అని నాగ్ ఒప్పుకున్నాడు. కానీ తండ్రి మాటలను విని ఆయన కెరీర్‌పరంగా, వ్యక్తిగత జీవితంలోనూ నేడు విజయ పధంలో సాగుతున్నాడు. అదే అఖిల్ విషయానికి వస్తే తన మొదటి చిత్రమే లోకాన్ని రక్షించే బాధ్యతలను భుజాన వేసుకుని 'అఖిల్' చేసి డిజాస్టర్ పొందాడు. నాగ్ మాట విని చేసిన 'హలో' పెద్ద విజయం సాధించకపోయినా కూడా మంచి పేరునైతే తెచ్చింది.
ఇక తాజాగా నాగ్, అఖిల్ గురించి మాట్లాడుతూ, అఖిల్ తొందరపడ్డాడు. పెద్దోళ్ల మాటలు వింటే బాగుండేది అని ఓపెన్‌గా వ్యాఖ్యానించాడు. బాలీవుడ్‌లోకి అఖిల్‌ని కరణ్ జోహార్ ద్వారా పరిచయం చేయబోతున్నారా? అన్న ప్రశ్నకు నాగ్ సమాధానం ఇస్తూ, టాక్స్ జరిగిన మాట వాస్తవమే. తానే ఇంట్రడ్యూస్ చేస్తానని కరణ్ జోహార్ రెండు మూడు సార్లు అడిగాడు. కానీ ఇప్పుడే తొందరపడవద్దని చెప్పాను. అఖిల్ ఇప్పటికే ఒకసారి తొందరపడ్డాడు. పెద్దోళ్ల మాట వింటే బాగుంటుంది. కనీసం ఇలాంటప్పుడైనా పెద్దల మాటలు వినాలి అని వ్యాఖ్యానించాడు. నిజంగా సొంత కొడుకుపైనే పంచ్ వేయడం అనేది నాగ్‌కే చెల్లింది. మొత్తానికి నాగ్ ఓపెన్ మైండ్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే...!